IAS, IPS, IFS అధికారుల పెట్టుబడుల వివరాలు కోరిన కేంద్రం!

by Harish |
IAS, IPS, IFS అధికారుల పెట్టుబడుల వివరాలు కోరిన కేంద్రం!
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారులకు కీలక ఆదేశాలిచ్చింది. ఏదైనా ఒక కేలండర్ ఏడాదిలో ఆరు నెలల బేసిక్ పే కంటే ఎక్కువ విలువైన స్టాక్స్, షేర్లు, ఇతర పెట్టుబడుల లావాదేవీల గురించి ప్రభుత్వానికి ఇవ్వాలని వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ వివరాలు అఖిల భారత సర్వీస్ నిబంధనలు(1968) రూల్ 16(4) ప్రకారం ప్రతి ఏడాది ఇచ్చే వివరాలకు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.

సాధారణంగా రూల్ 14(1) ప్రకారం, భారత సర్వీసుల్లో ఉన్న ఏ వ్యక్తి అయినా స్టాక్స్, షేర్లు, ఇతర సాధనాల్లో పెట్టుబడులు పెట్టడం ఊహాజనిత పెట్టుబడిగానే పరిగణించబడుతుంది. అయితే స్టాక్-బ్రోకర్లు లేదా అనుమతి పొందిన ఇతర వ్యక్తుల ద్వారా అప్పుడప్పుడు చేసే పెట్టుబడికి వీలుంటుంది. అలాగే, షేర్లు, డిబెంచర్లు, సెక్యూరిటీలు చరాస్తుల పరిధిలోకి వస్తాయి, కాబట్టి, వాటిలో వ్యక్తిగత లావాదేవీల విలువ రెండు నెలల బేసిక్ పే కంటే ఎక్కువగా ఉంటే ఆ వివరాలను రూల్ 16(4) ద్వారా సంబంధిత అధికారులకు ఇవ్వాలి. లావాదేవీ పూర్తయిన నెలరోజుల్లో సమాచారం అందించాలి. వీటికి తాజా ఆదేశాలు అదనంగా ఉంటాయని పేర్కొంది.

Advertisement

Next Story