మరిన్ని జిల్లాలకు విస్తరించిన ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి విధానం!

by Harish |
మరిన్ని జిల్లాలకు విస్తరించిన ఆభరణాల హాల్‌మార్కింగ్ తప్పనిసరి విధానం!
X

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేసిన నిర్ణయానికి సంబంధించి కేంద్రం మూడో దశను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 16 రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ విధానాన్ని విస్తరించింది. 2021, జూన్‌లో కేంద్ర ప్రభుత్వం బంగారం స్వచ్ఛతను నిర్ధారించే హాల్‌మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. అనంతరం రెండు దశలు పూర్తవగా, తాజా విస్తరణతో మొత్తం 343 జిల్లాల్లో ఇది అందుబాటులోకి వచ్చిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఈ నిబంధనను సమర్థవంతంగా అమలు చేస్తోందని, రోజుకు సగటున 4 లక్షల బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ జరుగుతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. బీఐఎస్ యాప్ నుంచి వినియోగదారులు తమకు కావాల్సిన ఆభరణాల స్వచ్ఛతకు సంబంధించి హెచ్‌యూడీ ద్వారా తనిఖీ చేసుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కొత్తగా 4 జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 5 జిల్లాలకు విస్తరించారు. అందులో తెలంగాణాకు చెందిన నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, మల్కాజ్‌గిరి, నిజామాబాద్ జిల్లాలకు హాల్‌మార్కింగ్ తప్పనిసరి విధానం కొత్తగా విస్తరించింది. ఏపీలో కొత్తగా ఏలూరు, ఎన్‌టీఆర్, అన్నమయ్య, డా బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లాలకు విస్తరించింది.

Advertisement

Next Story

Most Viewed