పాన్-ఆధార్ లింక్‌తో రూ. 600 కోట్ల వసూళ్లు

by S Gopi |
పాన్-ఆధార్ లింక్‌తో రూ. 600 కోట్ల వసూళ్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడంలో జాప్యం కారణంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ. 600 కోట్లను జరిమానా రూపంలో వసూలు చేసింది. ఈ మేరకు లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరీ లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2023, జనవరి 29 నాటికి మినహాయించినవి కాకుండా ఆధార్‌తో లింక్ చేయని ఇంకా 11.48 కోట్ల పాన్ కార్డులు ఉన్నాయని సోమవారం పార్లమెంటులో ప్రభుత్వం తెలిపింది. 2023, జూన్ 30 చివరి తేదీ తర్వాత తమ పాన్, ఆధార్ లింక్ చేయని వారికి రూ. 1,000 ఆలస్య రుసుమును ప్రభుత్వం విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంతో 2023, జూలై 1 నుంచి 2024, జనవరి 31 మధ్య పెనాల్టీల రూపంలో రూ. 601.97 కోట్లు వచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. తమ ఆధార్‌ను పాన్‌తో లింక్ చేయడంలో విఫలమైతే పన్ను చెల్లింపుదారుల పాన్ కార్డు 2023, జూలై 1 నుంచి పనిచేయదని, టీడీఎస్, టీసీఎస్ వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. రూ. 1,000 ఆలస్య రుసుము చెల్లించి తిరిగి పాన్ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story