SBI Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి.. ఆమోదించిన ప్రభుత్వం

by S Gopi |
SBI Chairman: ఎస్‌బీఐ ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి.. ఆమోదించిన ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఛైర్మన్‌గా తెలుగు వ్యక్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మంగళవారం చల్లా శ్రీనివాసులు శెట్టిని నియమిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. 2024, ఆగస్టు 28న ప్రస్తుతం ఛైర్మన్‌గా ఉన్న దినేశ్‌ కుమార్‌ ఖారా పదవీ కాలం పూర్తవనున్న నేపథ్యంలో ఆ స్థానంలోకి శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి రాణా అశుతోష్ కుమార్ సింగ్‌ను కూడా కేబినెట్ కమిటీ నియమించింది. దినేష్ ఖారా ఎస్‌బీఐ ఛైర్మన్ పదవికి గరిష్ట వయో పరిమితి 63 ఏళ్లు నిండినందున ఆయన ఆగష్టు 28న పదవి విరమణ చేయనున్నారు. అంతకుముందు జూన్ 30న ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎస్‌ఐబీ) శ్రీనివాసులు శెట్టి పేరును సిఫారసు చేసింది. ఆయనతో పాటు ఛైర్మన్ పదవి కోసం అశ్విని తివారీ, వినయ్ టోన్సే పోటీగా ఉన్నారు. శ్రీనివాసులు శెట్టి ఎస్‌బీఐలో సుమారు 35 ఏళ్లుగా పనిచేస్తున్నారు. బ్యాంకుకు చెందిన అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ విభాగాలకు హెడ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2020, జనవరిలో ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed