- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Uber-Ola: ఉబర్, ఓలా కంపెనీలకు నోటీసుల జారీ

దిశ, బిజినెస్ బ్యూరో: వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం క్యాబ్ సేవలందించే ఓలా, ఉబర్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకునేందుకు ఉపయోగించే మొబైల్ మోడల్‌ని బట్టి రైడింగ్ ఛార్జీలను విధిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ఇటీవలి కాలంలో వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులు అందాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్ ఖరీదును బట్టి కూడా ఛార్జీల్లో తేడా ఉన్నట్టు కొందరు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వాలని రెండు కంపెనీలకు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు కొంతమంది ఒకే దూరానికి ఇరు కంపెనీలు వేర్వేరు మొత్తాల్లో ఛార్జీలు విధిస్తున్నట్టు కూడా ఫిర్యాదు చేశారు. ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) సైతం దీనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఒకే రకమైన సర్వీసుకు రెండు రకాల ధరలను ఎలా నిర్ణయించారనే దానిపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. కస్టమర్లపై విధించే ఛార్జీల్లో పారదర్శకత తీసుకునేందుకు సమగ్రమైన వివరణ కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవల ఓ కస్టమర్ ఉబర్ కంపెనీ ఫోన్ మోడల్‌ని బట్టి కాకుండా అందులోని బ్యాటరీ పర్సంటేజీ ఆధారంగా కూడా ఛార్జీల్లో వ్యత్యాసాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం మరింత చర్చకు వచ్చింది. పలు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌ల ద్వారా పరిశీలించిన తర్వాత కూడా దీన్ని నిర్ధారించినట్టు సదరు వినియోగదారుడు పోస్ట్‌లో స్పష్టం చేశాడు. వినియోగదారుల నుంచి దోపిడీని ప్రభుత్వం ఏమాత్రం సహించదని, సమగ్ర విచారణ జరిపి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని సీసీపీని ఆదేశించినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు.