భారత్‌లో విస్తరణను వేగవంతం చేసిన ఫాక్స్‌కాన్!

by Harish |
భారత్‌లో విస్తరణను వేగవంతం చేసిన ఫాక్స్‌కాన్!
X

బెంగళూరు: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్‌ల కాంట్రాక్ట్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్ భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను విస్తరించేందుకు భారీ పెట్టుబడులు పెడుతోంది. చైనాకు బయట తయారీని మరింత పెంచాలని భావిస్తున్న ఫాక్స్‌కాన్ భారత్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలోనే బెంగళూరులో 300 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. దానికోసం కంపెనీ సుమారు రూ. 303 కోట్లను వెచ్చించింది.

యాపిల్ సంస్థ చైనాలో నెలకొన్న పలు సమస్యల కారణంగా తయారీని ఇతర దేశాలకు విస్తరించే పనిలో ఉంది. ఇటీవలే దేశీయంగా మొదటి రెండు రిటైల్ స్టోర్లను కూడా ప్రారంభించింది. ఫాక్స్‌కాన్ సైతం కొవిడ్-సంబంధిత అడ్డంకులు, యుఎస్‌తో చైనా సంబంధాలు దెబ్బతిన్నందున చైనా వెలుపల వ్యాపార విస్తరణ ద్వారా తయారీని పెంచాలని భావిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఫాక్స్‌కాన్ సంస్థ దేశీయంగా దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెడుతుందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా కూడా దేశీయంగా రూ. 1,891 కోట్లతో కొత్త తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా ఏర్పాటయ్యే యూనిట్‌లో కంపెనీ ఏసీలు, కంప్రెషర్లను తయారు చేయనుంది.

Advertisement

Next Story

Most Viewed