Budget2025: బడ్జెట్‌లో మూలధన, మౌలిక వ్యయంపై దృష్టి పెట్టాలి: ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్

by S Gopi |
Budget2025: బడ్జెట్‌లో మూలధన, మౌలిక వ్యయంపై దృష్టి పెట్టాలి: ఆర్‌బీఐ ఎంపీసీ సభ్యుడు నగేష్
X

దిశ, బిజినెస్ బ్యూరో: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వివిధ రంగాలు, నిపుణుల నుంచి సూచనలు ఆర్థిక మంత్రిత్వ శాఖకు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) విధాన కమిటీ సభ్యుడు నగేష్ కుమార్ కీలక సూచనలు చేశారు. ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు, మరింత స్థిరంగా కొనసాగేందుకు మూలధన వ్యయంతో పాటు మౌలిక సదుపాయాల ఖర్చులపై దృష్టి సారించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నమోదైన తక్కువ వృద్ధిని సమీక్షించి వృద్ధిని పెంచేందుకు, మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఇది దోహదపడుతుందని చెప్పారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా భారత ఆర్థికవ్యవస్థ చాలా నష్టపోయినప్పటికీ, ఆ తర్వాత బలమైన పునరుద్ధరణ కనబడింది. కానీ, గత రెండేళ్ల నుంచి వేగవంతమైన వృద్ధికి కారణమైన డిమాండ్ ముగింపు దశకు చేరుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వం వ్యయం పెంచాలని నగేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇటీవల భారత కరెన్సీ బలహీనతపై స్పందించిన ఆయన.. ఇది రూపాయి బలహీనపడటం కాదని, డాలర్ విలువ అమాంతం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. డాలర్ చాలా పటిష్టంగా మారుతోంది. ఈ ప్రభావం వల్లే రూపాయితో పాటు ఇతర దేశాల కరెన్సీలు కూడా బలహీనపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

Next Story