- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
DeepSeek: 'డీప్‌సీక్' దెబ్బకు అమెరికా కంపెనీకి రూ. 51 లక్షల కోట్ల నష్టం
దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏఐ గురించి విపరీతంగా చర్చిస్తున్న వేళ మరో సంచలనం టెక్నాలజీ రంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ఏఐ విభాగంలో చాట్‌జీపీటీ, గూగుల్ జెమిని వంటివి ఎక్కువ ఆదరణ పొందుతుండగా, తాజాగా చైనాకు చెందిన డీప్‌సీక్ స్టార్టప్ కంపెనీ విడుదల చేసిన ఏఐ చాట్‌బోట్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ జనవరిలోనే విడుదలైన 'డీప్‌సీక్' కొన్నిరోజుల్లోనే యాపిల్ స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్‌గా నిలిచింది. అమెరికాకు చెందిన ఏఐ కంపెనీల కంటే చాలా తక్కువ ఖర్చులో ఈ యాప్‌ను తీసుకురావడమే ఈ రికార్డులకు కారణం. ఈ రంగంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, మెటా లాంటి కంపెనీలు వేలాది కోట్లను ఖర్చు చేసి ఏఐని అభివృద్ధి చేస్తుండగా, డీప్‌సీక్ కేవలం 6 మిలియన్ డాలర్ల(మన కరెన్సీలో రూ. 51 కోట్ల) ఖర్చుతో రూపొందించారు. డేటా ప్రకారం.. డౌన్‌లోడ్ ర్యాంకింగ్స్‌లో జనవరి 25న 102 స్థానంలో ఉండగా, జనవరి 27 నాటికి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రముఖ చాట్‌జీపీటీ(8), గూగుల్ జెమిని (13) ర్యాంకులను కలిగి ఉన్నాయి. యాపిల్ ఐఓఎస్‌లోని యాపిల్ స్టోర్ డౌన్‌లోడ్‌లలో డీప్‌సీక్ జనవరి 18న 132వ ర్యాంక్ నుంచి జనవరి 25న 9వ స్థానానికి, ఆ తర్వాత జనవరి 27న టాప్‌లో నిలిచింది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌లో జనవరి 17న డీప్‌సీక్ యాప్ 447వ స్థానంలో ఉంది. చాట్‌జీపీటీ రెండోస్థానంలో, జెమిని 14వ స్థానంలో ఉన్నాయి. జనవరి 28 నాటికి 15వ స్థానానికి చేరుకుంది.
ఎన్విడియాకు రూ. 51 లక్షల కోట్ల నష్టం..
చైనాకు చెందిన ఈ డీప్‌సీక్ కంపెనీ ఇప్పటివరకు ఏఐ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెరికా కంపెనీల భవిష్యత్తును దెబ్బతీసింది. వేలాది కోట్ల ఖర్చుతో ఆయా కంపెనీలు ఏఐలో పెట్టుబడులు విరుద్ధంగా డీప్‌సీక్ అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా చిప్ తయారీ కంపెనీలతో సహా టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికాలోని టెక్ కంపెనీల షేర్లు భారీగా కుదేలవడమే కాకుండా, అమెరికా స్టాక్ మార్కెట్ నాస్దాక్ 3 శాతానికి పైగా క్షీణించింది. ముఖ్యంగా ఏఐ విభాగంలో శక్తివంతమైన చిప్‌లను తయారు చేసే అమెరికా కంపెనీ ఎన్విడియా మార్కెట్ విలువ ఏకంగా 600 బిలియన్ డాలర్ల సంపదను కోల్పోయింది. ఈ మొత్తం మన కరెన్సీలో రూ. 51.92 లక్షల కోట్లు కావడం గమనార్హం. అమెరికా చరిత్రలో ఒక కంపెనీ ఒక్కరోజులోనే ఈ స్థాయి నష్టాన్ని చూడటం ఇదే మొదటిసారి.
సైబర్ అటాక్..
ఏఐ రంగంలో విడుదల రోజుల వ్యవధిలోనే సంచలనంగా మారిన డీప్‌సీక్ చాట్‌బాట్‌కు కూడా సైబర్ దాడి తప్పలేదు. అనూహ్యంగా చర్చలోకి వచ్చిన తమ సంస్థ కార్యకలాపాలపై సైబర్ దాడి జరిగిందని కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. దానివల్ల కొత్త యూజర్లు రిజిస్టర్ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనట్టు కంపెనీ పేర్కొంది.
డీప్‌సీక్ ఎలా పనిచేస్తుంది..
డీప్‌సీక్ చైనాలో ఏర్పాటైన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) కంపెనీ. దీని కార్యకలాపాలు 2023లోనే ప్రారంభమయ్యాయి, కానీ దీని ఏఐ చాట్‌బాట్ ఆర్1ను ఈ నెల 10న విడుదల చేశారు. లియాంగ్ వెన్‌ఫెండ్ అనే వ్యక్తి డీప్‌సీక్‌ను ప్రారంభించారు. ఇది చాట్‌జీపీటీ, ఇతర చాట్‌బోట్ తరహాలో కాకుండా పూర్తి ఉచితంగా ఉపయోగించవచ్చు. పనితీరు ఇతర చాట్‌బోట్‌ల మాదిరిగానే ఉంటుంది. వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ల ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు. డీప్‌సీక్ ఆర్1 మోడల్ ఇదివరకటి చాట్‌బాట్‌లకు భిన్నంగా సంక్లిష్టమైన ప్రశ్నలకు కూడా కొంత సమయం తీసుకుని సమగ్రంగా వివరిస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు.
డొనాల్డ్ ట్రంప్ స్పందన..
చైనా డీప్‌సీక్ అతి తక్కువ ఖర్చుతో రూపొందించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. సిలికాన్ వ్యాలీకి ఇదొక వేక్-అప్ కాల్ లాంటిదని, బిలియన్ డాలర్లు ఖర్చు కాకుందా తక్కువ ఖర్చుతో ఇలాంటి చాట్‌బాట్‌లాను తీసుకురావొచ్చన్నారు.