ఆశించిన స్థాయిలో లేని పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయం!

by Dishaweb |
ఆశించిన స్థాయిలో లేని పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయం!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు ఆశాజకంగా లేవని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రక్రియ ఊహించిన దానికంటే ఎక్కువ సమయం తీసుకోవడం ఇందుకు కారణమని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఐడీబీఐ బ్యాంక్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లాజిస్టిక్స్‌ సంస్థ కంటెయినర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (కాంకర్‌)లలో వాటా విక్రయ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25)లోనే ఉండే అవకాశం ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు నెమ్మదించాయని, ఐడీబీఐ బ్యాంకు విక్రయంలో జాప్యం కారణంగా అనుకున్న ఆదాయం రాలేదని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.

ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ. 15,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించింది. దీంతో పాటు కాంకర్, షిప్పింగ్ కార్పొరేషన్‌లలో వాటా విక్రయంలో కూడా ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోంది. దానివల్ల మొత్తం పెట్టుబడుల ఉపసంహరణ ఆదాయంపై ప్రభావం చూపుతోంది. పెద్ద వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలు ఏమీ ఉండకపోవచ్చు. చిన్న మొత్తంలో ఇప్పటికీ జరుగుతున్నాయి. డివిడెండ్ల ద్వారా ఆదాయాన్ని పొందడంపై దృష్టి సారించినట్టు అధికారి పేర్కొన్నారు. కాగా, ఇప్పటివరకు ప్రభుత్వం డివిడెండ్‌లతో సహా మొత్తం రూ. 10,917 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ నుంచి వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 51 వేల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలను నిర్దేశించింది.

Advertisement

Next Story

Most Viewed