రూ. 31.33 లక్షల కోట్లకు చలామణీలో ఉన్న నగదు!

by Harish |   ( Updated:2023-03-13 13:40:48.0  )
రూ. 31.33 లక్షల కోట్లకు చలామణీలో ఉన్న నగదు!
X

న్యూఢిల్లీ: గతేడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ. 31.33 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో తెలిపారు. 2014 సమయంలో చలామణిలో ఉన్న కరెన్సీ విలువ రూ. 13 లక్షల కోట్లని వెల్లడించారు. అలాగే, 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ 2022, మార్చి నాటికి 13.7 శాతానికి పెరిగిందన్నారు.

2016లో ప్రభుత్వం నోట్ల రద్దు ప్రకటించినపుడు రూ. 16.63 లక్షల కోట్ల నుంచి 2017, మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదు విలువ రూ. 13.35 లక్షల కోట్లకు తగ్గింది. అయితే, ఆ తర్వాత నుంచి ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు ప్రతి ఏటా పెరుగుతూ వచ్చింది. 2018, మార్చిలో రూ. 18.29 లక్షల కోట్ల నుంచి 2019, మార్చికి రూ. 21.36 లక్షల కోట్లకు, 2020, మార్చికి రూ. 24.47 కోట్లకు పెరిగింది. 2021, మార్చికి రూ. 28.53 లక్షల కోట్లకు, 2022 చివరి నాటికి రూ. 31.33 లక్షల కోట్లకు పెరిగింది.

నల్లధనాన్ని కట్టడి చేస్తూ, చలామణిలో ఉన్న కరెన్సీ తగ్గించి, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇక, ఆర్‌బీఐ గతేడాది తీసుకొచ్చిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(ఈ-రూపీ) విలువ ఇప్పటివరకు రూ. 130 కోట్లకు చేరిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి రిటైల్ డిజిటల్ ఈ-రూపీ రూ. 4.14 కోట్లు ఉండగా, టోకు విభాగంలో రూ. 126.27 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.

Also Read...

ఎస్‌వీబీ దెబ్బకు పతనమైన స్టాక్ మార్కెట్లు!

Advertisement

Next Story