SEBI: మరోసారి సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు

by S Gopi |
SEBI: మరోసారి సెబీ చీఫ్‌పై కాంగ్రెస్ ఆరోపణలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్‌పై కాంగ్రెస్ ఆరోపణలను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా శుక్రవారం ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో సహా వివిధ ఉల్లంఘనలపై సెబీ విచారణను ఎదుర్కొంటున్న కంపెనీ నుంచి అద్దె ఆదాయాన్ని పొందిందని పేర్కొంది. మాధబి బుచ్‌కు చెందిన స్థలాన్ని ఆ కంపెనీకి అద్దెకు ఇచ్చారని సమాచారం. 2018-19 నుంచి 2023-24 మధ్య కాలంలో మాధబి బుచ్ ముంబైలోని తన స్థలాన్ని కరొల్ ఇన్ఫోస్ సర్వీసెస్ కంపెనీకి అద్దెకు ఇచ్చారు. సమీక్షించిన కాలంలో దాన్నుంచి ఆమెకు రూ. 2.16 కోట్ల అద్దె ఆదాయం లభించింది. కానీ, ఈ కంపెనీ సెబీ దర్యాప్తు పరిధిలో ఉంది. ఇది అవినీతికి కిందకు వస్తుందని, సెబీ సభ్యురాలిగా మాధబి బుచ్ దర్యాప్తు పరిధిలో ఉన్న సంస్థ నుంచి ఆదాయం పొందడం సెబీకి ఉన్నటువంటి విశ్వసనీయత, జవాబుదారీని ప్రశ్నించేదిగా ఉందని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా అన్నారు. ఇదే వ్యవహారంలో ప్రధాని మోడీ ఎందుకు స్పందించడంలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. కాగా, ఇటీవలే మాధబి బుచ్‌పై కాంగ్రెస్ సంచలన ఆరోపణలు చేసింది. 2017లో సెబీ సభ్యురాలైన ఆమె, అంతకుముందు పనిచేసిన ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి వేతనాన్ని తీసుకున్నారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. దీనిపై బ్యాంకు కూడా స్పందించింది. రిటైర్‌మెంట్ ప్రయోజనాలు తప్పించి ఎలాంటి చెల్లింపులు చేయట్లేదని ప్రకటించింది.

Advertisement

Next Story