iPhone: ఐఫోన్ అప్‌డేట్‌లో సమస్యలు.. యాపిల్‌కి సీసీపీఏ నోటీసులు

by S Gopi |
iPhone: ఐఫోన్ అప్‌డేట్‌లో సమస్యలు.. యాపిల్‌కి సీసీపీఏ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఇండియా కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(సీసీపీఏ) షాక్ ఇచ్చింది. ఇటీవల కంపెనీ విడుదల చేసిన ఐఓఎస్ 18 ప్లస్ అప్‌డేట్ తర్వాత సమస్యలు ఎదురైనట్టు వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ప్రకటించారు. నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌కు అందిన ఫిర్యాదులను సీసీపీఏ సమీక్షించిందని జోషి చెప్పారు. వాటిని పరిశీలించిన తర్వాత, బదులివ్వాలని నోటీసులిచ్చినట్టు ఆయన స్పష్టం చేశారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా తలెత్తిన సాంకేతిక సమస్యలు, పనితీరు గురించి సమగ్రంగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసులతో భారత ప్రభుత్వం టెక్ కంపెనీలపై నిఘా, వినియోగదారులు ఎదుర్కొనే సమస్యల పట్ల కంపెనీలకు అప్రమత్తత అవసరమని సూచిస్తున్నాయి. చాలామంది ఐఫోన్ కస్టమర్లు ఐఓఎస్ 18కి అప్‌డేట్ చేసిన తర్వాత బ్యాటరీ త్వరగా అయిపోవడం, ఎక్కువ హీట్ కావడం, పనితీరు నెమ్మదించడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. కొంతమంది వినియోగదారులు కార్‌ప్లే, సఫారీ, యూట్యూబ్ మ్యూజిక్ సరిగా పనిచేయడం లేదని కూడా ఫిర్యాదులు చేశారు.

Next Story