సాధారణ స్థితికి ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు

by S Gopi |
సాధారణ స్థితికి ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: క్యాబిన్ సిబ్బంది సమ్మె కారణంగా వందల సంఖ్యలో విమానాల అంతరాయం ఏర్పడిన తర్వాత ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ కార్యకలాపాలు దాదాపు సాధారణ స్థితికి చేరుకున్నాయని సంబంధిత అధికారులు తెలిపారు. మంగళవరం విమానాలేవీ రద్దు కాలేదని వెల్లడించారు. యాజమాన్యం తీరుపై కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్న సిబ్బందిలో దాదాపు 300 మంది మూకుమ్మడి సెలవులు పెట్టడం వివాదానికి కారణమయ్యింది. దానివల్ల చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు సంస్థ తీసుకున్న చర్యలు ఫలించడంతో కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చాయని, షెడ్యూల్ చేసిన అన్ని విమానాలు మంగళవారం గాల్లోకి ఎగిరాయని ఓ అధికారి చెప్పారు. సంస్థ సుమారు 345 విమానాలను నడపగా, ఒక్కటి కూడా రద్దు కాలేదని మరో అధికారి తెలిపారు. దీనికి సంబంధించి ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదివారం నాటి ప్రకటనలో ఆరోగ్య కారణాలతో సెలవుపై వెళ్లిన క్యాబిన్ సిబ్బంది అందరూ తిరిగి విధుల్లో చేరారని ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed