అదానీ, డీబీ పవర్ ఒప్పందానికి ముగిసిన గడువు!

by Harish |   ( Updated:2023-02-16 10:16:59.0  )
అదానీ, డీబీ పవర్ ఒప్పందానికి ముగిసిన గడువు!
X

ముంబై: దేశీయ ఇంధన రంగంలో కార్యకలాపాలను నిర్వహిస్తున్న డీబీ పవర్‌ను కొనుగోలు చేసే ఒప్పందానికి గడువు ముగిసిందని అదానీ పవర్ ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 7,017 కోట్ల విలువైన ఈ ఒప్పందం నిర్దేశించిన తేదీ నాటికి లావాదేవీ పూర్తి కాకపోవడంతో కొనుగోలు ప్రక్రియ విఫలమైందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.

గతేడాది ఆగష్టులో డీబీ పవర్‌కు చెందిన థర్మల్ విద్యుత్ ఆస్తులను కొనేందుకు అదానీ పవర్ ఒప్పందం చేసుకుంది. దానికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రూ. 7,017 కోట్లకు కొననున్నట్టు పేర్కొంది. థర్మల్ పవర్ రంగంలో అదానీ కంపెనీ విస్తరణకు ఈ ఒప్పందం దోహదపడుతుందని భావించింది.

అంతేకాకుండా ఇంధన రంగంలో రెండో అతిపెద్ద డీల్‌గా ఇది నిలిచింది. ఆ సమయంలో ఒప్పందాన్ని అక్టోబర్ 31 నాటికి పూర్తి చేసేందుకు ఇరు కంపెనీలు నిర్ణయించాయి. ఆ తర్వాత గడువును నాలుగు దశల్లో వాయిదా వేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు పొడిగించారు. తాజాగా ఆఖరు తేదీ ముగిసిన నేపథ్యంలో ఒప్పందం ముగిసినట్టు కంపెనీ స్పష్టం చేసింది.

గత కొన్ని వారాలుగా అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆర్థిక ఆరోపణలు చేయడంతో అదానీ కంపెనీలు భారీగా పతనమయ్యాయి. ఈ క్రమంలోనే డీబీ పవర్ కొనుగోలు రద్దవడం మార్కెట్ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

Advertisement

Next Story

Most Viewed