రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో దేశీయ వ్యాపార విశ్వాసం

by Shyam |
రెండేళ్ల గరిష్ఠ స్థాయిలో దేశీయ వ్యాపార విశ్వాసం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణను సూచిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో వ్యాపార విశ్వాసం రెండేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌సీఏఈఆర్) వెల్లడించింది. ఈ ఏడాది కరోనా సెకెండ్ వేవ్ మహమ్మారి పరిస్థితుల తర్వాత వ్యాపారాల విశ్వాసం మెరుగుపడిందని, అంతకుముందు త్రైమాసిక కంటే 90 శాతంగా, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 80 శాతం పురోగతి కనిపించిందని ఎన్‌సీఏఈఆర్ డైరెక్టర్‌ జనరల్‌ పూనమ్‌ గుప్తా తెలిపారు. దేశంలోని మొత్తం 500 కంపెనీలను పరిగణలోకి తీసుకోగా కొన్ని మినహా అన్ని ప్రాంతాల్లో వ్యాపారాల సెంటిమెంట్ మెరుగుపడిందని ఎన్‌సీఏఈఆర్ నివేదిక వివరించింది.

మొత్తం ఆర్థిక పరిస్థితులు రానున్న ఆరు నెలల్లో మరింత మెరుగుపడతాయని, గతం కంటే ఇప్పుడు పెట్టుబడుల వాతావరణం సానుకూలంగా ఉండటం కలిసొచ్చే అంశమని నివేదిక తెలిపింది. ఇప్పుడున్న వినియోగ సామర్థ్యం సరైన స్థాయిలోనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో పెద్ద సంస్థలు, చిన్న సంస్థల మధ్య ఉన్న వ్యాపార విశ్వాస వ్యత్యాసం భారీగా తగ్గింది. ఉత్పత్తి, దేశీయ అమ్మకాలు, కొత్త ఆర్డర్లు, ఎగుమతులు, ముడి సరుకుల దిగుమతులు, పన్నులకు ముందున్న లాభాలు విశ్వాసాన్ని పెంచేందుకు దోహదం చేస్తున్నాయని నివేదిక వివరించింది. ఇదే సమయంలో ముడి పదార్థాల ఖర్చులు 54 శాతం పెరిగాయని, రానున్న త్రైమాసికాల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మూడింట రెండొంతుల సంస్థలు స్పష్టం చేశాయి.

Advertisement

Next Story