పండుగ పూట విషాదం.. ఆ తాతకు కన్నీళ్లే మిగిలాయి

by Sridhar Babu |   ( Updated:2021-08-22 06:38:58.0  )
rakesh-died
X

దిశ, జమ్మికుంట : మరికొద్ది సేపట్లో తన మనవడు తిరిగి ఇంటికి చేరుతాడని ఎదురుచూస్తున్న ఆ తాతను విధి తీవ్ర విషాదంలో నింపింది. కూతురు, అల్లుడికి ప్రతిరూపంగా చూసుకుంటున్న మనవడు కూడా అందరినీ వదిలేసి వెళ్లడం ఆయన గుండె బరువెక్కింది. మేనత్తను మెట్టినింట దించివచ్చేందుకు వెళ్లిన ఆ మనవడు విగతజీవిగా మారాడని తెలియడంతో ఆ తాత కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.

వివరాల్లోకి వెలితే… పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో సమీపంలోని చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న వేల్పుగొండ రాకేష్ (26) అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట సమీపంలోని రామన్నపల్లిలో తన తాత బుచ్చయ్య ఇంట్లో మనవడు రాకేష్ ఉంటున్నాడు. కరీంనగర్‌లో బీటెక్ ఫైనల్ ఈయర్ చదువుకుంటున్న రాకేష్ తండ్రి మహేందర్ 4 ఏళ్ల కిందట చనిపోగా, తల్లి స్వరూప 16 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటినుండి రాకేష్, అతని సోదరి అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నారు. రాకేష్ సోదరికి గత డిసెంబర్‌లో వివాహం జరిగింది. కరీంనగర్‌లో చదువుకుంటున్న రాకేష్ సెలవుల్లో అమ్మమ్మ ఊరైన రామన్నపల్లికి వెళ్తుంటాడు. రాఖీ పౌర్ణమి కావడంతో ఆదివారం పుట్టినింటికి వచ్చిన మేనత్తను పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో కారులో దించేందుకు వెళ్లాడు. మేనత్తను దించి వస్తుండగా కనగర్తి శివార్లలో అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పక్కన ఉన్న చెరువులో కారుతో సహా పడిపోవడంతో చనిపోయాడు. రాకేష్ మరణ వార్త తెలిసిన అమ్మమ్మ, తాతయ్యలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో రామన్నపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story