‘ఆయన ఆత్మహత్యకు కారణం.. ఎమ్మెల్యే వనమా కొడుకే’

by Sridhar Babu |   ( Updated:2021-08-13 07:48:04.0  )
BSP leader Kamesh
X

దిశ, కొత్తగూడెం: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా తనయుడి మూలంగా ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది నిజంగా కాదా? అని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక బీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… జిల్లాలో ఎమ్మెల్యే కొడుకు రాఘవ చేసే పనులు వనమాకు తెలియనివి కావని, ఆ విషయం నియోజకవర్గం మొత్తం తెలుసని స్పష్టం చేశారు. కానీ, వనమా మాత్రం తనకేమీ తెలియదన్నట్లు నటిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతనెల జులై 30వ తేదీన ఫైనాన్స్ వ్యాపారి ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి స్పష్టంగా, తన స్వహస్తాలతో సూసైడ్ నోట్ రాసి మరీ ఆత్మహత్య చేసుకున్న విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసునని అన్నారు.

ఈ ఆత్మహత్య వ్యవహారంలో తనపై కేసు నమోదైన విషయం గ్రహించిన ఎమ్మెల్యే తనయుడు తప్పించుకు తిరిగాడని, ఆయనకు సంబంధం లేకపోతే తప్పించుకొని తిరగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఆత్మహత్యకు ప్రధాన కారణమై, ఏ-1 నిందితుడిగా ఎఫ్ఐఆర్ నమోదైనా ఇంకా రాబోయే కాలంలో తానే ఎమ్మెల్యేను అని రాఘవ చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు రాఘవ బానిసలు కాదనే విషయాన్ని గుర్తించాలని హితవు పలికారు. కొత్తగూడెం నియోజకవర్గం ఒక ప్రశాంతమైన ప్రాంతమని, రాఘవ గురించి తెలిసిన ఏ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వదనే విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తానని అన్నారు.

షాడో ఎమ్మెల్యేగా జిల్లాలో వనమా తనయుడు రాఘవ చేస్తున్న దందాపై ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నివేదిక ఉందని కామేష్ పేర్కొన్నారు. దీంతో గురువారం హుటాహుటిన కొంతమంది ప్రజాప్రతినిధులు స్థానిక కమ్మసత్రంలో సమావేశమై తాము వనమా వెంకటేశ్వరరావుకు, ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని చెప్పడం ఏంటో అంతు చిక్కడం లేదని అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మద్దతు ఏంటీ. దానికి ప్రత్యేక సమావేశం ఏంటీ, అని ప్రశ్నించారు. అంటే ఇన్నేళ్లుగా ఎమ్మెల్యే వనమాకి ఈ ప్రజాప్రతినిధుల మద్దతు లేదా అని అడిగారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంధం మల్లికార్జున రావు, అసెంబ్లీ కన్వీనర్ బొంతు కిరణ్, చుంచుపల్లి మండల అధ్యక్షురాలు వీణ, గుడివాడ రాజేందర్, సందేల శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story