కాలువలో అన్నదమ్ములు మిస్సింగ్.. ఒకరు మృతి

by Sumithra |
కాలువలో అన్నదమ్ములు మిస్సింగ్.. ఒకరు మృతి
X

దిశ, నల్లగొండ : ఈత కోసం వెళ్లిన అన్నదమ్ములు కాలువలో గల్లంతవ్వగా ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. ఈ ఘటన నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. పిల్లల తండ్రి రాంబాబు, రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. నల్లగొండ మండలం మర్రిగూడ గ్రామం సుందరయ్య కాలనీకి చెందిన గార్లపాటి రాంబాబు, మమతకు ఇద్దరు కుమారులు. వీరిద్దరు కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రోజు లాగే ఆదివారం వారి కుమారులు ప్రేమ్ చంద్(7), నందు(6)ను ఇంటివద్దే ఉంచి పనికి వెళ్లారు. వేసవి కావడంతో అన్నదమ్ములు ప్రేమ్ చంద్, నందు సమీపంలోని ఎస్ఎల్బీసీ కాల్వలో ఈతకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు ప్రేమ్ చంద్ కాల్వలో కొట్టుకుపోయాడు. ఆర్జాలబావి సమీపంలో బాలుడి మృతదేహం కొట్టుకొస్తుండటం గమనించిన స్థానికులు బయటకు తీసి వెంటనే రూరల్ ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి సమాచారం అందించారు. ఆయన ఘటనా స్థలికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా సుందరయ్యకాలనీకి చెందిన రాంబాబు కుమారుడిగా స్థానికులు గుర్తించి వెంటనే తల్లిదండ్రులకు తెలియపరిచారు. వారు వెంటనే అక్కడకు చేరుకుని కుమారుడిని గుర్తుపట్టి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్న కుమారుడు నందు ఆచూకీ లభించకపోవడంతో, అధికారులకు సమాచారం అందించి, కాల్వలో నీటిని తగ్గించి నందు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రేమ్ చంద్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story