గుండెపోటుతో ఒకేరోజు అన్నదమ్ముల మృతి

by srinivas |
గుండెపోటుతో ఒకేరోజు అన్నదమ్ముల మృతి
X

దిశ, ఏపీబ్యూరో : ఒకే పేగు తెంచుకు పుట్టిన అన్నదమ్ములే ఆస్తి కోసం కొట్టుకుంటున్న నేటి రోజుల్లో అన్న హఠాన్మరణాన్ని తట్టుకోలేక తమ్ముడూ ప్రాణాలు విడిచిన విషాద ఘటన మంగళవారం గుంటూరులో చోటుచేసుకుంది. ఒకేరోజు అన్నాతమ్ముళ్లు గుండెపోటుతో కన్నుమూయడం వారి కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. గుంటూరు ఫాతిమాపురానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్‌ అబ్దుల్‌ నబీ (40) బేకరీలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఆయనకు గుండె నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.అన్న కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడాన్ని తమ్ముడు షేక్‌ దస్తగిరి (36) తట్టుకోలేకపోయారు. గుండెనొప్పితో అక్కడే కుప్పకూలారు. వైద్యులు పరీక్షించి దస్తగిరి కూడా కన్నుమూశాడని చెప్పారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం అలముకుంది. దస్తగిరి పెయింట్‌ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Next Story