చెల్లెలి కోసం అన్న సాహసం

by  |
చెల్లెలి కోసం అన్న సాహసం
X

దిశ, వెబ్ డెస్క్: అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా ఒక పండుగే జరుపుకుంటాం. అన్ని కష్టాల్లో, నష్టాల్లో తోడుగా ఉండి, రక్షిస్తానానని అన్న, తన చెల్లికి మాట ఇస్తూ జరుపుకునే పండుగ అది. ఇంకా ఆ పండుగకు సమయం ఉంది కదా, ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని అనుకోవద్దు. ఎందుకంటే ఆ పండుగ పరమార్థాన్ని నిజజీవితంలో చూపించిన ఒక అన్న గురించి ఈ స్టోరీ. అన్న అనగానే ఏదో ఒక ముప్పై ఏండ్ల వ్యక్తి, ఆర్థిక కష్టాల్లో ఉన్న చెల్లెలికి అండనిచ్చి, సాయం చేశాడని ఊహించుకోవద్దు. మనం మాట్లాడుకోబోయే ఆ అన్న వయసు కేవలం ఆరేండ్లే. ఆ వయస్సులో అన్నాచెల్లెళ్ల అనుబంధం ఇంత బలంగా ఉండాలన్న విషయం కూడా తెలియదు. కానీ, ఒకవేళ చావు గనక వస్తే, అది ముందు నన్ను దాటాలి అనేంత సాహసం చేశాడంటే అతనికి గట్టి స్ఫూర్తి అయినా ఉండి ఉండాలి లేదా చెల్లెలి మీద అమితమైన ప్రేమ అయినా అయ్యుండాలి. ఆ అన్న తన చెల్లెలి కోసం ఎంతటి సాహసం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

అన్న పేరు బ్రిడ్జర్ వాకర్. వారు అమెరికాలోని వ్యోమింగ్ రాష్ట్రంలో నివాసం ఉంటున్నారు. జూలై 9వ తేదీన చెల్లితో కలిసి ఆడుకుంటుండగా ఒక కుక్క వారి మీద దాడికి దిగింది. అదే సమయంలో అన్నగా తన బాధ్యతను గుర్తుచేసుకున్న బ్రిడ్జర్, చెల్లిని కరవబోతున్న కుక్క మీదికి దూకాడు. అలాగని కుక్కను కొట్టలేదు. అది చెల్లిని కరవకుండా ఉండటానికి తనను కరిపించుకున్నాడు. అది కరుస్తుండగానే దాన్ని బెదరగొట్టి, చెల్లిని తీసుకుని ఇంట్లోకి పారిపోయాడు. ఈ కథను బ్రిడ్జర్ బంధువు నికోల్ నోయల్ వాకర్ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్టు చేసింది. ఆ ఫొటోలో బ్రిడ్జర్ చెంప మీద కుక్క చేసిన గాయాలను చూసి అందరూ చలించిపోయారు. అదే ఫొటోలో పక్కన బ్రిడ్జర్ చెల్లికి ఒక్క గాయం కూడా లేకపోవడం చూసి అతని ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు. బ్రిడ్జర్ ఒక నిజమైన అన్న అని, ధైర్యానికి జేజేలు పలుకుతున్నారు.

ఇదే పోస్టులో బ్రిడ్జర్‌కు ఇష్టమైన సూపర్ హీరో పాత్రలు పోషించే నటీనటులను కూడా నికోల్ ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్టు మరింత వైరల్ అయింది. ముఖం మీద తొంబైకి పైగా కుట్లు పడ్డాయని తెలిసి నటి ఆనీ హాత్‌అవే కూడా బ్రిడ్జర్‌ సాహసాన్ని అభినందించింది. ప్రపంచ బాక్సింగ్ కౌన్సిల్ వారు బ్రిడ్జర్ సాహసానికి మెచ్చి, గౌరవ ప్రపంచ చాంపియన్‌గా ప్రకటించారు. అయితే బ్రిడ్జర్‌ని పొగడుతూ చాలా మంది ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు. ఆ సాయాలు అన్నింటిని గాయపడిన సైనికులకు సాయం చేసే వూండెడ్ వారియర్ ప్రాజెక్టుకి విరాళంగా ఇవ్వాలని నికోల్ తన పోస్టులో పేర్కొంది. ఏదేమైనా రాఖీ పండుగకు ముందు ఇలాంటి ఒక ధైర్యసాహసం గురించి తెలుసుకున్న అన్నలు అందరూ పండుగ అయినా కాకపోయినా తన తోబుట్టువుకి ఎప్పటికీ అండగా ఉండాలని గుర్తుచేసుకునే అవకాశం కలిగింది.


Next Story

Most Viewed