పెళ్లైన 24 గంటల్లోపే నవవధువు మృతి

by  |
పెళ్లైన 24 గంటల్లోపే నవవధువు మృతి
X

పెళ్లి ఇంట్లో విరిసిన ఆనందం కాస్త 24గంటల్లోనే ఆవిరైంది. ఏమైందో తెలీదు.. కాళ్ల పారాణి ఆరాకముందే నవవధువు మృతిచెందింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. ముప్పాళ్ళ మండలం ఇరుకుపాలేనికి చెందిన తురకా సుందరరావు కొడుకు ఫోటోగ్రాఫర్ ఆనంద్‌కు రొంపిచర్ల మండలం మునమాకకు చెందిన చావా వీరబాబు కుమార్తె భవాని( 20)కి పెద్దలు వివాహం కుదిర్చారు. వధువు భవానీ టీటీసీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటోంది. ఆమె కొంతకాలంగా ఆయాసంతో బాధపడుతోంది. నిశ్చితార్థం ముగిసిన క్రమంలో రెండు కుటుంబాల మధ్య తర్జనభర్జన పడి చివరకు గురువారం ఉదయం ఇరుకు పాలెంలోని చర్చిలో వివాహం జరిపించారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమార్తెను అల్లుడికి అప్పగించి వీరబాబు కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళిపోయారు.

తెల్లవారుజామున 2 గంటల సమయంలో భవానీకి శ్వాస సమస్య వచ్చి ఉక్కిరిబిక్కిరైంది. వెంటనే కుటుంబీకులు నరసరావుపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్సకు నిరాకరించడంతో గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ వచ్చి చికిత్స అందించే లోపే భవాని మృతి చెందింది. అయితే, వివాహానికి ముందు ఈ నెల 4న నిర్వహించిన కరోనా పరీక్షలో ఆమెకు నెగెటివ్ వచ్చింది.

వైద్యులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో ఖననం చేసేందుకు మునమాక తీసుకెళ్ళారు. నవవధువు మరణంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదం చోటుచేసుకుంది.


Next Story