పెళ్లై మూడ్రోజులే.. నవ వధువు సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్: కాళ్ల పారాణి ఆరలేదు, చేతి గోరింటాకు పోలేదు. ఇంట్లో సందడి తగ్గలేదు.. మామిడి తోరణాలు వాడలేదు. కానీ ఇంతలోనే ఆ పెండ్లి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. సంతోషంగా అత్తగారింట్లో అడుగు పెట్టి, నిండ నూరేళ్లు భర్తతో కాపురం చేయాల్సిన నవ వధువు కానరాని లోకాలకు పోయింది. కనిపెంచిన వాళ్లను కాదనుకొని, ఏడడుగులు నడిచిన భర్తను వదులు కొని శాశ్వతంగా అందరి నుంచి దూరమై పోయింది. వందేళ్ల జీవితాన్ని 20ఏళ్లకే అర్థాంతరంగా ముగించుకొని పాడె ఎక్కింది. దీంతో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో మూడ్రోజుల్లోనే చావు డప్పులు మోగడంతో తల్లిదండ్రులు గుండెలు బాధుకుంటున్నారు. కళ్లముందే కన్నపేగు కాటికి చేరడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగి పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన తీవ్ర విషాదకర సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు రమ్య శ్రీదేవి అనే 20 ఏళ్ల యువతి రాజమండ్రిలో డిగ్రీ పూర్తి చేసింది. నెలక్రితం హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్లిన యువతికి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మాపురం గ్రామానికి చెందిన తన మేనమామతో పెళ్లి నిశ్చయించారు. జూలై 26న వివాహం జరిగింది. శనివారం రోజు నవ వధువును అత్తగారింటికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులతో పాటు, బంధువులు ఇంట్లో పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి ఎలుకల మందు తిన్న యువతి కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మండపేట ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది.

అయితే యువతిని ఇంటికి వెళ్లిన సమయంలో తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని కోరగా తర్వాత చేసుకుంటానని చెప్పగా, బంధువులు ఒప్పించినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ పెళ్లి చేయగా మూడ్రోజులకే శుక్రవారం మధ్యాహ్నం నవ వధువు దారుణానికి ఒడిగట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువతి పెళ్లి ఇష్టంలేక సూసైడ్ చేసుకుందా లేకుంటే ఉన్నత చదువు ఆగిపోయిందన్న మనస్తాపంతో ప్రాణాలు తీసుకుందా అన్న దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతురాలి ఫోన్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు. యువతి ఇటీవల హైదరాబాద్‌లో షార్ట్‌ఫిల్మ్‌లో నటించినట్లు తెలుస్తుండగా… ఈనెల 2న (ఆదివారం) విడుదల కానున్నట్లు సమాచారం.

Advertisement