Delhi stampede : మహాకుంభమేళా ఎఫెక్ట్.... న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట... పలువురి పరిస్థితి విషమం

by M.Rajitha |   ( Updated:15 Feb 2025 8:01 PM  )
Delhi stampede : మహాకుంభమేళా ఎఫెక్ట్.... న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట... పలువురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్ డెస్క్ : దేశ రాజధాని న్యూఢిల్లీ(New Delhi) ప్రధాన రైల్వే స్టేషన్లో శనివారం సాయంత్రం భారీ తొక్కిసలాట(Stampede) జరిగింది. ఫ్లాట్ ఫార్మ్ నెం. 14 , 15 వద్ద ప్రయాగ్ రాజ్ వెళ్ళే రైలు ఎక్కేందుకు భారీగా జనం పోటీ పడటంతో ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. కాగా వారాంతం కావడంతో ప్రయాగ్ రాజ్(Prayag Raj) లో జరుగుతున్న మహకుంభమేళా(Mahakumbhmela)కు వెళ్లేందుకు జనం విపరీతంగా రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఫ్లాట్ ఫాం మీదకు ట్రైన్ వస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఎక్కేందుకు అందరూ ఎగబడటంతో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలు కాగా.. పలువురు అపస్మారకస్థితిలోకి వెళ్ళారు. తక్షణమే స్పందించిన రైల్వే పోలీసులు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వీకెండ్ కావడం... మరో 10 రోజుల్లో మహకుంభమేళా ముగుస్తుండటంతో లక్షలాది మంది కుంభమేళాకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా అత్యధిక రద్దీ ఉంటుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వేశాఖ ఢిల్లీ నుంచి 2 ప్రత్యేక రైళ్ళను ప్రయాగ్ రాజ్ కు ఏర్పాటు చేసినప్పటికీ.. అవేవీ కూడ భక్తుల తాకిడిని తట్టుకోలేక పోయాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో మహకుంభమేళా మొదలు కాగా ఇప్పటి వరకు దాదాపు 47 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మహా కుంభమేళా ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు ముగియనుంది. మరోవైపు ప్రయాగ్ రాజ్ వైపు చేరుకునే రోడ్లు యాత్రికులతో కిక్కిరిసి పోతున్నాయి. వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతుండటంతో... కుంభమేళా జరిగే చోట నో వెహికల్ జోన్ గా ప్రకటించింది యూపి ప్రభుత్వం.

Next Story

Most Viewed