జనం నమ్మలేదనే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడు: డిప్యూటీ స్పీకర్

by Jakkula Mamatha |   ( Updated:2024-02-13 12:57:50.0  )
జనం నమ్మలేదనే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నాడు: డిప్యూటీ స్పీకర్
X

దిశ, తిరుమల: జనం తనను నమ్మడం లేదని తెలిసే, కుయుక్తులతో పొత్తుల కోసం అన్ని రాజకీయ పార్టీల వెంట వెంపర్లాడుతున్నారని మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పై రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆయన మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాము కాబట్టి తిరిగి ప్రజల ఆశీస్సులు కోరుతూ వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పుకు వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.

వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన సీఎం గా జగన్ చరిత్రలో నిలిచిపోయారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరని, ఆయన పై ఎవరు గెలవ లేరని అన్నారు. జగన్ కు పైన దైవబలం, కింద జన బలం ఉన్నంతవరకు ఆయనను ఎవరూ ఏమీ చేయలేరని తెలిపారు. దేశంలో ఎక్కడ లేనంతగా ఈ రాష్ట్రంలో మాత్రమే ఒక్క పైసా లంచం లేకుండా, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్న ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు. అందులో భాగంగా జగన్ పై అసూయతో ఈర్ష, ద్వేషం తో కూడుకున్న ఆరోపణలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదన్నారు.

మేము ధైర్యంగా చెబుతున్నాం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎవరైనా లంచం అడుగుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దని ధైర్యంగా చెబుతున్నట్లు తెలిపారు. ఇదే మాట మిగిలిన పార్టీల నాయకులు ఎవరైనా ఇంత ధైర్యంగా చెప్పగలరా అని సవాల్ చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పాలన చూస్తే ఎలా ఉండేదంటే..‘మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావ్.. మా ఇంటికి వస్తే నాకేం తెస్తావ్’ అనే విధంగా సాగిందని ఎద్దేవా చేశారు. తనకు బలం లేదని, ప్రజలు నన్ను ఆదరించరని తెలిసే, పొత్తుల కోసం అన్ని రాజకీయ పార్టీ నాయకుల వెంట వెంపర్లాడుతున్నారని నారా చంద్రబాబు నాయుడు పై ధ్వజమెత్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఎవరు వచ్చినా సరే, ఎవరు ఎన్ని కుయుక్తులు పన్నినా సరే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఎవరు ఆపలేరని ఆయన తెలిపారు.

Advertisement

Next Story