వణికిస్తోన్న ఒమిక్రాన్.. మరోసారి ‘లాక్‌డౌన్’ తప్పదా..?

by Anukaran |   ( Updated:2021-12-02 00:43:37.0  )
వణికిస్తోన్న ఒమిక్రాన్.. మరోసారి ‘లాక్‌డౌన్’ తప్పదా..?
X

దిశ, తెలంగాణ బ్యూరో : సరదా రోజులకు మళ్లీ బ్రేక్ పడనున్నదా? రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఆంక్షలు మళ్ళీ అమలయ్యే అవకాశం ఉన్నదా? ట్యాంక్​ బండ్ ఫన్‌డేతో మొదలైన కట్టడి చర్యలు ఇకపైన విస్తృతం కానున్నాయా? వీటన్నింటికీ వైద్యారోగ్య శాఖ నుంచి ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఇతర దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్​ను అడ్డుకునేందుకు కరోనా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు అంతర్గత ఆదేశాలను ఇచ్చింది. జన సమూహాలను తగ్గించాలని సూచించింది. హైదరాబాద్​లోని ట్యాంక్​ బండ్​పై ప్రతీ ఆదివారం జరిగే ‘సండే ఫన్​డే’కార్యక్రమం రద్దు కానుంది.

ప్రస్తుతానికి డిసెంబరు 5వ తేదీన మాత్రమే ఫన్ డే కార్యక్రమం ఉండదంటూ మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పినా, ఇకపైన ప్రతీ ఆదివారం ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాల ద్వారా తెలిసింది. అంతేగాక గ్రూప్ గేదరింగ్స్ ఎక్కువగా జరిగే బార్లు, పబ్లు, హోటళ్లు, సినిమాహాళ్లు తదితరాలపై కూడా ఇలాంటి ఆంక్షలు విధించడంపై అధికారులు దృష్టి సారించారు. అక్కడి తాజా పరిస్థితిపై ఎక్సైజ్, రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు తనిఖీల రూపంలో పరిశీలించనున్నారు. కరోనా కేసుల తీవ్రత, కొవిడ్ మార్గదర్శకాల అమలుపైనా దృష్టి పెట్టనున్నారు.

ఇక ఇటీవల విద్యా సంస్థల్లో పాజిటివ్​లు నమోదు కావడం కూడా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. వీరి ద్వారా ఇండ్లలోని పెద్దలకు కూడా వ్యాపిస్తుందని వైద్యారోగ్య శాఖ ఆందోళన పడుతున్నది. వీటన్నింటినీ గమనంలోకి తీసుకుని ఒమిక్రాన్ వ్యాప్తి నివారణ కోసం షాపింగ్ మాల్స్, మార్కెట్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు తదితరాలను నియంత్రించాలనుకుంటున్నది. వైద్యారోగ్య శాఖ సమర్పించే నివేదికను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ వ్యాప్తి పెరిగినట్లయితే ఆంక్షలు తప్పవని సెక్రటేరియట్లోని ఓ ఉన్నతాధికారి కూడా నొక్కి చెప్పారు.

కేసులు పెరుగుతున్నాయ్..

రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతానికి డెల్టా ప్రభావంతోనే కొత్త ఇన్ఫెక్షన్లు తేలుతున్నప్పటికీ, కొత్త వేరియంట్ ఒమెక్రాన్ ప్రవేశిస్తే వ్యాప్తి స్పీడ్​గా ఉంటుందని నిపుణుల అంచనా. ఇప్పటికే స్కూళ్లు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, ఐటీ సంస్థలు, విద్యాసంస్థలు, జనసమూహాలు కల్గిన ప్రదేశాల్లో గత 20 రోజుల నుంచి కేసులు వ్యాప్తి పెరిగింది. ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ వైరస్ అవుట్ బ్రేక్ అయ్యే అవకాశం ఉన్నదని అధికారులూ ఆందోళన చెందుతున్నారు. దీంతో తొలి విడత జనసమూహాలను నిషేదించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత కేసులు తీవ్రత కొనసాగితే గతంలో మాదిరిగానే కరోనా ఆంక్షలు పూర్తి స్థాయిలోకి అమల్లోకి వస్తాయని అధికారులు ఆఫ్​ ది రికార్డులో చెబుతున్నారు.

కొత్త వేరియంట్ పై నో క్లారిటీ…

కొత్త వేరియంట్ సోకిన బాధితుల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం ఇప్పటికిప్పుడు సాధ్యం కానందున ముందస్తు జాగ్రత్తలే మేలును చేకూరుస్తాయని కేబినెట్ సబ్​ కమిటీ కూడా భావిస్తున్నది. సాధారణ కరోనాతో పోల్చితే ఒమెక్రాన్ వ్యాప్తి రెట్టింపు స్థాయిలో ఉన్నందున, కేసులు పెరిగితే వైరస్​ నియంత్రణ కొరకు ఆంక్షలు విధిస్తేనే బెటరనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నది. ఆరోగ్యశాఖ అధికారులు కూడా అంతర్గతంగా ప్రభుత్వానికి ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఈనెలాఖరు వరకు 100 శాతం వ్యాక్సినేషన్​ను పూర్తి చేయాలని ప్రభుత్వం వైద్యశాఖకు టార్గెట్ ఇచ్చింది.

క్వారంటైన్ తప్పనిసరి…

విదేశాల నుంచి వచ్చే వారిని ఇప్పటికే ప్రభుత్వం క్వారంటైన్ విధిస్తున్నది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణీకులపై కూడా దృష్టి పెట్టాలని కేబినేట్ సబ్ కమిటీ ఆలోచిస్తున్నది. తెలంగాణలోకి వచ్చేవారు కచ్చితంగా రెండు డోసులు తీసుకోవడంతో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ ఉంటేనే అనుమతించనున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు మళ్లీ అమల్లోకి వచ్చేశాయి. దీంతో కేసులు పెరగకుండా గతంలో కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ఆంక్షలు విధించాలనుకుంటున్నారు

కొత్త కరోనా వ్యాప్తి 6 రెట్లు అధికం

కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మరో ముప్పును చవి చూడాల్సి వస్తుంది. పాత కరోనాతో పోల్చితే కొత్త వేరియంట్ వ్యాప్తి ఆరు రెట్లు ఎక్కువగా ఉన్నదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిందే. వీలైనంత వరకు జనసమూహాల్లోకి వెళ్లవద్దు. అర్హులంతా వ్యాక్సిన్ పొందాలి. దీంతో సీరియస్, హాస్పిటలైజేషన్ పరిస్థితులు తగ్గుతాయి.
-డాక్టర్ శ్రీనివాసరావు, డీహెచ్

హైరిస్క్ గ్రూప్ అప్రమత్తంగా ఉండాలి

కొత్త వేరియంట్ ఎయిడ్స్, క్యాన్సర్తో పాటు దీర్ఘకాలిక రోగులపై ప్రభావం ఎక్కువగా చూపుతున్నది. దీంతో వీరు మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. రెండు డోసుల వ్యాక్సిన్ తప్పనిసరి. ఇప్పటి వరకు తీసుకోనివారు వెంటనే టీకా తీసుకోవాలి. వీలైనంత వరకు గ్రూప్ గేదరింగ్స్ నియంత్రించాలి. మాస్కు, భౌతిక దూరాన్ని మరవద్దు.
-డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ హెచ్ఓడీ, నిజామాబాద్

అఖండ మూవీ రివ్యూ.. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన బాలయ్య

Advertisement

Next Story

Most Viewed