పాలేరు కాలువకు భారీ గండి.. నీట మునిగిన పొలాలు

by  |
పాలేరు కాలువకు భారీ గండి.. నీట మునిగిన పొలాలు
X

దిశ, పాలేరు: పాలేరు పాత కాలువ పరిధిలోని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామం వద్ద భారీ గండి పడింది. కొత్త కొత్తూరు సమీపంలో 6.1వ కిలోమీటరు వద్ద సుమారు 8 మీటర్ల వెడల్పుతో గట్టు తెగిపోయింది. దీంతో స్థానిక పంట పొలాలన్నీ జలమయమయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువను అక్రమించడంతోనే ఈ గండి పడినట్టు రైతులు చెబుతున్నారు. వరి నాట్లు జోరుగా సాగుతున్న తరుణంలో కాలువకు గండి పడటంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌కు, సాగునీరు అందించేందుకు కొద్ది రోజుల కిందే పాత కాలువకు అధికారులు నీరు విడుదల చేశారు.

ఈ కాలువ నుంచి సుమారు 900 క్యూసెక్కుల నీరు ఆయకట్టుకు వెళ్తోంది. కాలువను కొత్త కొత్తూరు వద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించి బలహీన పరిచినట్టు తెలుస్తోంది. దీనికి తోడు అధిక ప్రవాహంతో గండి పడే ప్రమాదమూ ఉంది. సాగర్ అధికారులు ముందే పరిశీలించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని రైతులు అంటున్నారు. బోదులబండ రోడ్ నుంచి కొత్త కొత్తూరు వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాలువ పై కన్నేసి అక్రమిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ కాలువ పరిధిలో ప్రవహిస్తున్న నీటితో సుమారు 1.35 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. 48వ కిలోమీటరు వద్ద ఉన్న బోనకల్ వరకు ఈ నీరు ప్రవహిస్తుంది.

కాలువల పర్యవేక్షణకు అవసరమైన లస్కర్లను నియమించడంలేదు. అధికారులు పర్యవేక్షించడం లేదు. దీంతో ఏటా ఎదో ఒక చోట కాలువలకు గండ్లు పడుతున్నాయి. కాగా కాలువ గండిని పూడ్చేందుకు ఎన్నెస్పీ అధికారులు చర్యలు ప్రారంభించారు. డీఈలు మన్మధరావు , జేఈ గండి ప్రాంతాన్ని సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎస్‌ఈ మాట్లాడుతూ.. కుడి వైపున ఉన్న కారణంగా గండి పడిందన్నారు. రైతులకు అసౌకర్యం కలగకుండా చూస్తామని, సాగునీటిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.



Next Story