కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్

by  |
కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్
X

దిశ వెబ్ డెస్క్ : కరోనా తెచ్చిన విపత్తులో.. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను మనం చూస్తూనే ఉన్నాం. నిద్రాహారాలు మాని, ప్రజలు కోసం నిరంతరం పాటు పడుతున్న డాక్టర్లు గురించే వింటూనే ఉన్నాం. తమ ప్రాణాలను పణంగా పెట్టి బాధ్యతలను నిర్వర్తిస్తున్న డాక్టర్లను చూసి ఎంతోమంది చలించిపోతున్నారు. ఇదే నేపథ్యంలో.. భోపాల్ కు చెందిన ఓ డాక్టర్ కూడా అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. తన కారును నివాస గృహంగా మార్చుకున్న ఆ వైద్యుడ్ని మధ్యప్రదేశ్ రాష్ర్ట ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ప్రత్యేకంగా అభినందించారు.

భోపాల్‌లోని జేపీ ఆస్పత్రిలో డాక్టర్ సచిన్ నాయక్ పనిచేస్తున్నారు. ఆయన కరోనా రోగుల వార్డులో వైద్య సేవలందిస్తున్నారు. కోవిడ్ అంటు వ్యాధి కావడంతో.. తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారు. ఆసుపత్రికి ప్రాంగణంలోని తన కారులోనే నిద్రిస్తున్నాడు. అందులో తనకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుకున్నాడు. తనకు తానుగా క్వారంటైన్ లో ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ముందు జాగ్రత్తగా :

‘‘భోపాల్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొదట భయపడ్డాను. ఆ తర్వాత నేను కరోనా రోగులకు చికిత్స చేస్తున్నందు వల్ల ముందుజాగ్రత్తగా నా కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను. అందుకు నా కారునే.. పడుకునేందుకు అనుకూలంగా మార్చుకున్నాను. అందులో నేను రోజు చదివే పుస్తకాలతో పాటు, నాకు అవసరమయ్యే వస్తువులను సమకూర్చుకున్నాను. ఇంటి సభ్యులతో పోన్ లో మాట్లాడుతున్నాను’అని డాక్టర్ సచిన్ చెప్పారు. అయితే డాక్టర్లకు హోటళ్లలో వసతి సౌకర్యాలు కల్పిస్తామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి, దాని కోసం సన్నాహాలు చేస్తోంది. హోటల్ గది కేటాయించే వరకూ తాను కారులోనే నిద్రిస్తున్నానని డాక్టర్ వివరించారు.

అందరూ అలానే ఉంటే విజయం :

డాక్టర్ కారులోనే పడుకునే అంశానికి సంబంధించి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ఫోటో చూసిన మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కూడా నాయక్‌ను ప్రశంసించారు. ‘యావత్ మధ్యప్రదేశ్ మొత్తం మీలాగే వ్యవహరిస్తే, కరోనా మహమ్మరిపై విజయం సాధించడం సునాయసం అవుతుంది. అందరూ ఈ విధంగా ఆలోచించాలి. కరోనా వైరస్ పై చేస్తున్న ఈ పోరాటంలో మీలాంటి యోధులను ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న స్పూర్తికి వందనం’ అని శివరాజ్‌సింగ్ చౌహన్ పేర్కొన్నారు.

మధ్యప్రదేశ్ లో కరోనా కేసులు సంఖ్య 229 కి చేరుకుంది. ఇప్పటి వరకు అక్కడ 16 మంది కరోనా వల్ల చనిపోయారు.

Tags :corona virus, doctor sachin nayak,mp cm, sivaraj singh nayak, bhopal doctor



Next Story

Most Viewed