భవిష్యత్ దిక్సూచిగా.. బ్లాక్ చైన్

by Shyam |   ( Updated:2020-05-17 03:20:14.0  )
భవిష్యత్ దిక్సూచిగా.. బ్లాక్ చైన్
X

టెక్నాలజీని అధికంగా నమ్మేవారు బ్లాక్ చైన్, క్రిప్టోకరెన్సీ స్థాయిలో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. ఓ మోస్తరుగా నమ్మేవారు ఇప్పుడిప్పుడే యూపీఐలు, ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్లు చేస్తున్నారు. అయితే అసలు సమస్యల్లా టెక్నాలజీని పూర్తిగా నమ్మని వారితోనే. వాళ్లది చాదస్తమని అధికంగా నమ్మేవారు అంటుంటారు. అయితే ఇప్పుడు కొవిడ్ 19 కారణంగా అన్ని రకాల పరిశ్రమలు, రంగాలు ప్రభావితమయ్యాయి. దీంతో మళ్లీ పునర్:వైభవాన్ని పొందడమెలా? అనే దిశలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంప్రదాయవాదుల దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కానీ టెక్నాలజీని అధికంగా నమ్మేవారి దగ్గర ఒకే ఒక్క సమాధానం ఉంది. కేవలం ఈ ప్రశ్నలకే కాదు.. భవిష్యత్తులో తలెత్తబోయే ప్రతి సమస్యకు వారి దగ్గర ఉన్న సమాధానం.. బ్లాక్ చైన్ టెక్నాలజీ. కేవలం ఆర్థికమనే కాదు.. హ్యాకింగ్, పేదరికం, ఆకలి, ఆరోగ్య సంక్షోభాలకు సంబంధించిన సమస్యలను ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ పరిష్కరించగలదు. ఈ సందర్భంగా బ్లాక్ చెైన్ టెక్నాలజీ పరిష్కరించగల కొన్ని సమస్యల గురించి చర్చిద్దాం.

1. దృఢమైన సప్లై చెైన్ మేనేజ్‌మెంట్

కొవిడ్ 19 కారణంగా బాగా ప్రభావితమైన రంగాలు పరిశ్రమలు, వ్యవసాయం. వ్యవసాయంలో ఉత్పత్తి కాబడిన ముడి సరుకును పరిశ్రమలకు, పరిశ్రమల చివరి ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయడానికి సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్ అవసరం. కానీ కొవిడ్ కారణంగా ట్రక్కులను నడిపే డ్రైవర్ల కొరత ఏర్పడి వ్యవస్థ స్తంభించిపోయింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కి బ్లాక్ చైన్ టెక్నాలజీ జోడించడం వల్ల అందుబాటులో ఉన్న తక్కువ మంది డ్రైవర్లనే సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కేవలం స్మార్ట్‌ఫోన్ ద్వారానే ఉత్పత్తుల డెలివరీ, డ్రైవర్‌కు చెల్లింపులు పూర్తవుతాయి. ఇప్పటికే ఈ టెక్నాలజీని అమెజాన్ వేర్‌హౌస్ సెంటర్లు అభివృద్ధి చేశాయి. కానీ అమల్లోకి తీసుకురావడానికి సంప్రదాయవాదులు సందేహించారు. ఇక ఇప్పుడు కొవిడ్ 19 రావడంతో దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి చేయాల్సిన అవసరం ఏర్పడింది.

2. యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్, డిజిటల్ కరెన్సీ

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరాల్సిన ఉద్దేశంతో యూనివర్సల్ బేసిక్ ఇన్‌కమ్ కాన్సెప్టును అమలు చేసేందుకు వివిధ దేశాలు ఇప్పటికే యోచిస్తున్నాయి. ఇందులో డిజిటల్ కరెన్సీని దేశ ప్రజలకు ప్రతిఏట కొంత మొత్తంగా వారి ఖాతాల్లోకి పంపిస్తారు. ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల బాధితులకు ప్రకటిస్తున్న ప్యాకేజీల్లో డబ్బు నేరుగా లబ్ధిదారునికి చేరడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు వలస కూలీలకు కొంత మొత్తాన్ని ప్యాకేజీగా ప్రకటించిన ప్రభుత్వం.. ఆ డబ్బు నేరుగా వారికి చేరేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే బిట్‌కాయిన్ ఉపయోగించవచ్చు. ఇంకా ఇప్పుడు నోట్లు, నాణేల ద్వారా వైరస్ వ్యాపించే అవకాశాలున్నందున డిజిటల్ కరెన్సీ అవసరం మరింత పెరుగుతోంది.

3. టోకనైజేషన్, ఫ్రాక్షనల్ ఓనర్‌షిప్

ఎన్ని ఆస్తులు సంపాదించినా కరోనా వైరస్ ధాటితో అవన్నీ అవసరానికి ఉపయోగపడకుండా పోయాయి. ముఖ్యంగా స్థిరాస్తులు. కాబట్టి స్థిరాస్తులను కూడా చరాస్తులుగా మార్చే శక్తి బ్లాక్‌ చైన్ టెక్నాలజీకి ఉంది. దీన్ని ‘అసెట్ టోకనైజేషన్’ అంటారు. ఎలాగూ రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా ప్రభావితమైంది కాబట్టి ఒక 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలాన్ని ఒక్కోటి రూ. 10 విలువ గల డిజిటల్ టోకెన్లుగా విభజించి, ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టొచ్చు. దీని వల్ల స్థిరాస్తిని చరాస్తిగా మార్చుకొని కష్టసమయాల్లో వినియోగించుకోవచ్చు.

4. గ్లోబల్ హెల్త్ రికార్డు రిపాజిటరీ

ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని కొవిడ్ 19 నిరూపించింది. దీంతో ప్రపంచంలో అందరి హెల్త్ రికార్డు మెయింటెయిన్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ రిపాజిటరీ వల్ల ఆరోగ్యవంతుడిని గుర్తించి వైరస్‌లను కట్టడి చేయగల వ్యాక్సిన్లను తయారుచేయడం సులభమవుతుంది. ఇలా హెల్త్ రికార్డులను సృష్టించడానికి, వాటిని సురక్షితంగా యాక్సెస్ చేసుకోవడానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కలిసి పాండమిక్‌ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.

5. విరాళాల సేకరణ

లేని వారికి ఉన్నవారు సాయం చేయడంలో ఉన్న సంతోషాన్ని, సంతృప్తిని కొవిడ్ 19 చూపించింది. కానీ సాయం చేయాలంటే ముందు మన దగ్గర ఉన్న ఆస్తి సాయం చేయడానికి వీలుగా ఉండాలి. అందుకు ‘డిజిటల్ టోకెనైజేషన్’ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విరాళాల ద్వారా సేకరించిన సొమ్మును లబ్దిదారులకు చేర్చేందుకు కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తుంది.

కాబట్టి సంప్రదాయవాదులు ఇప్పటికైనా టెక్నాలజీ ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, డిజిటైజేషన్ మీద నమ్మకం ఉంచి, ఆర్థిక లావాదేవీలను, బ్లాక్ చెైన్ టెక్నాలజీని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని టెక్నాలజీని అధికంగా నమ్మేవారు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed