ఆత్మవిశ్వాసం చాలంటున్న లక్కీ..!

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఆ బాలుడికి నాలుగేండ్ల వయసు వచ్చే వరకు కంటికి రెప్పలా తల్లిదండ్రులు కాపాడుకున్నారు. అంతలోనే ఏమయిందో.. ఎమో.. మెల్లిమెల్లిగా కంటి చూపు మందగించింది. దీంతో తల్లిదండ్రులు తిరగని ఆస్పత్రి లేదు.. మొక్కని దేవుడు లేడు.. దేశంలో పేరున్న ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. విదేశాల్లోని ప్రముఖ వైద్యులకు బాబు కంటి సమస్యను వివరిస్తూ టెస్ట్ రిపోర్టులను పంపించారు. అతడికి చూపు తిరిగి తెప్పించడం అసాధ్యమని డాక్టర్లు తేల్చి చెప్పారు. మానసిక వేదనతో కాలం వెలదీస్తే మరింత ఇబ్బందులు పడడమే తప్ప మరోటి కాదని అనుకున్నారు. గుండె నిబ్బరం చేసుకుని తమ కడుపున పుట్టిన బిడ్డను తీర్చిదిద్దాలని భావించారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే వారి బిడ్డ కూడా అన్నింట్లో రాణిస్తున్నాడు.

నాలుగేళ్లలో అంధుడిగా..

కరీంనగర్ చైతన్యపురిలో నివాసం ఉంటున్న ప్రభుత్వ టీచర్ దీపక్ కొడుకు లక్కీ నాలుగేళ్ల వయసులో శాశ్వతంగా అంధుడిగా మారాడు. లక్కీని ఉన్నత చదువులు చదివించాలని దీపక్ దంపతులు ఎన్నో కలలు కన్నారు. వాటిని ఎలాగైనా నెరవేర్చాలనే సంకల్పంతో లక్కీకి చదువు చెప్పించారు. కరీంనగర్‌లోని పారమిత విద్యా సంస్థల్లో 10వ తరగతి వరకు ఉచిత విద్యను అందించారు.

అటు పేరెంట్స్ ఇటు టీచర్స్ అంచనాలకు మించి చదువులో ప్రతిభ కనబర్చిన లక్కీ ఏకంగా 10వ తరగతిలో 10 / 10 జీపీఏ సాధించారు. అయితే మిగతా బ్లైండ్ స్టూడెంట్స్ ఎంచుకున్నట్లుగా బ్రెయిలీ లిపిని కాకుండా సాధారణ విద్యనే అభ్యసిస్తుండడం విశేషం. ఇంటర్ ఫస్టియర్‌లో కూడా లక్కీ 96 పర్సెంటేజీ సాధించి తన ప్రతిభను ప్రదర్శించారు. స్కూల్లో టీచర్స్, క్లాస్ మెట్స్, ఇంట్లో పేరెంట్స్ అందరూ చదువుకునే విషయంలో బాసటగా నిలిచారు. ఒక్కసారి విన్న పాఠ్యాంశాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకోవడం లక్కీ స్పెషాలిటీ..

నా లక్ష్యం IAS..

ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. ఇప్పటి నుంచే యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా తండ్రి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు సివిల్ సర్వీసెస్ సాధిస్తా. క్లాస్ రూంలో అయినా ఇంట్లో అయినా నాకు వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. అయితే పోటీ ప్రపంచంలో చదువులో రాణించాలన్న సంకల్పంతో ముందుకు సాగాలంటే స్ట్రెస్ నుంచి కొంత రిలాక్స్ కావాలి.. అప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటాం.

-లక్కీ, కరీంనగర్

Advertisement