బీజేపీలో కలకలం… సంచలనంగా మారిన కార్యకర్త ఆడియో

by Anukaran |   ( Updated:2023-10-10 16:37:05.0  )
బీజేపీలో కలకలం… సంచలనంగా మారిన కార్యకర్త ఆడియో
X

దిశ, కామారెడ్డి రూరల్ : ఆయన బీజేపీలో నియోజకవర్గ స్థాయి ఇంచార్జీ. అన్ని వర్గాలను కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాల్సిన వ్యక్తి.. కేవలం తన సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తూ మిగతా వర్గాల వారిని పట్టించుకోలేదు. ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తూ పార్టీని నష్టపరుస్తున్నారని బీజేపీకి చెందిన ఓ సీనియర్ కార్యకర్త తన ఆవేదనను సోషల్ మీడియాలో వాయిస్ రికార్డ్‌తో పంచుకున్నారు.

KVRR(కాటిపల్లి వెంకట రమణారెడ్డి) బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జీగా వ్యవహరిస్తూ పార్టీలో ఏక్ నిరంజన్‌లా మారాడని.. కామారెడ్డి మండలం ఇస్రోజివాడికి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ కార్యకర్త సతీష్.. రమణా రెడ్డిపై మాటల దాడికి దిగారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గంలోని గణేష్ మండపాలకు రమణారెడ్డి పేరిట లడ్డూ ప్రసాదం పంపిణీ చేశారు.

అయితే, తమ గ్రామంలో కూడా లడ్డూ ప్రసాదం పంపిణీ చేసినప్పటికీ సీనియర్ కార్యకర్తలను పట్టించుకోకుండా ఒకరిద్దరు ఉన్న తన సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తూ తమను అవమానానికి గురి చేశారని ఆరోపించారు. ఇది ఒకటే కాకుండా పార్టీలో తన సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ మిగతా వర్గాలను వివక్షతకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకట రమణారెడ్డి కేవలం ఎమ్మెల్యే పదవి కోసమే పార్టీలోకి వచ్చారని ఆరోపించారు. గతంలో తాను ఎంపీటీసీగా పోటీ చేస్తే తనకు మద్దతుగా ప్రచారానికి రావాలని ఆహ్వానిస్తే రాలేదన్నారు.

గర్గుల్ గ్రామానికి చెందిన తన సామాజిక వర్గం కార్యకర్తకు టికెట్ ఇవ్వక పోవడంతోనే ప్రచారానికి రాలేదన్నారు. దీంతో తాను ఓటమి చెందానన్నారు. ఆయన కార్యకర్తలను పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తాను అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాలను కూడా కలుస్తానని వెల్లడించారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.


Next Story