సంచలనం: ఆ TRS ఎమ్మెల్యేలకు ఎంపీ అర్వింద్ ఆహ్వానం

by Shyam |
BJP MP Dharmapuri Arvind, TRS MLAs Ganesh Gupta, Bajireddy Govardhan
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘‘గత ఎనిమిది నెలలుగా నిజామాబాద్ నగర శివారులోని మాధవ‌నగర్ ఆర్ఓబీ పనులు జరుగకుండా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెండింగ్‌లో ఉంచిన విషయం తెలింసిందే. దీంతో మంత్రి తీరుకు నిరసనగా ఈనెల 28న మాదవ‌నగర్ రైల్వే గేట్ వద్ద ఎంపీ ధర్మపురి అర్వింద్ నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘‘ఈ నిరసన కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌లు పార్టీల కతీతంగా పాల్గొని, ప్రజా శ్రేయస్సు కోసం మద్దతు పలుకాలని ఒక పార్లమెంట్ సభ్యునిగా చేతులు జోడించి కోరుతున్న మీ అర్వింద్’’ అని ధర్మపురి అర్వింద్ పేరిట కరపత్రాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. శనివారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేరసిన లేఖలను ఆదివారం ఉదయం ముద్రించి ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ కరపత్రాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి.

నిజామాబాద్ నగర శివారులోని మాదవ నగర్ వద్ద రైల్వేగేట్ ఉంది. నిజాం జమానాలో వేసిన రైల్వే ట్రాక్ మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌గా మారింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్‌ను మోడల్ రైల్వేస్టేషన్‌గా తీర్చిదిద్దారు. కానీ ఇప్పటి వరకు రైల్వే గేట్ స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి లేదు. హైద్రాబాద్ నుంచి నాందేడ్ జాతీయ రహదారిపై ఉన్న ఈ రైల్వే ట్రాక్ ద్వారా నిత్యం 60 కి పైగా రైళ్లు పరిగేడుతాయి. రైళ్లు వచ్చినప్పుడల్లా గేట్ వేయడం ద్వారా చాలా సమయం వృథా అవుతోంది. దానికి తోడు ట్రాఫిక్ జాం అయి.. ట్రాఫిక్‌లో అంబులెన్సులు చిక్కుకొని ప్రాణాల మీదకు వచ్చిన సంఘటనలూ ఉన్నాయి. మూడు దశాబ్ధాలకు పైగా 1973 నుంచి ఆర్ఓబీ కల కళగానే మిగిలింది. ఉమ్మడి రాష్ర్టంలో ప్రణాళికల వరకు వచ్చినా.. అవి కార్యరూపం దాల్చలేదు. అయితే గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అర్వింద్ ఎన్నికల హామీ మేరకు 2020 అక్టోబర్ 11న రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి పచ్చజెండా ఊపి తన వాటాగా రూ.30.05 కోట్లను కేంద్రం విడుదల చేసింది. రాష్ర్టావాటాగా రూ.63.07 కోట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు భూ సేకరణ పనులు, రైల్వే, రోడ్డు భవనాల శాఖ అధ్వర్యంలో జరుగాల్సిన సర్వే కానీ, నిధుల విడుదల కానీ ఏవీ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేయడం లేదు. అగమేఘాల మీదా జరుగాల్సిన పనులు పెండింగ్‌లో ఉండటంతో బీజేపీ నేతలు నిరసనకు పిలుపునిచ్చారు. కేంద్రం నిధులు విడుదల చేసి 8 నెలలు గడిచినా మంత్రి నుంచి స్పందన రాకపోవడంతో నేరుగా మంత్రిని టార్గెట్ చేస్తూ ఎంపీ నిరసనకు పిలుపునిచ్చారు.

మాదవనగర్ బ్రిడ్జి నిజామాబాద్ అర్బన్, రూరల్ ప్రజలకు కీలకం. దానికి తోడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు అదే ప్రధాన రహదారి. రైల్వే ఓవర్ బ్రిడ్జి కోసం పట్టువదలని విక్రమార్కుడిలాగా పనిచేస్తున్న ఎంపీ అర్వింద్ వ్యూహాత్మకంగా నిరసన కార్యక్రమం ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. మొదటి నుంచి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి అంటే ఎంపీ అర్వింద్‌కు పడదన్న విషయం తెలిసిందే. అర్బన్ ఎమ్మెల్యేతో అంటీముట్టనట్టు ఉండే ఎంపీ వారిని ఆర్ఓబీ విషయంలో వారిని కలుపుకొని వెళ్లడం ఆసక్తికరంగా మారింది. మంత్రి వేముల అవలంభిస్తోన్న వైఖరిని ప్రజల్లోకి తీసుకువేళ్లేందుకు చేపట్టిన నిరసనలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కలుపుకు పోవడంతో మంత్రిని ప్రజల్లో ఒంటరి చేయ్యడం లక్ష్యం అని తెలుస్తోంది. అంతేగాకుండా.. కీలకమైన ఆర్ఓబీ నిర్మాణానికి నిధులు వచ్చినా.. రాష్ర్టావాటా ఇప్పించడంలో లోకల్ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేయడం లేదని చెప్పడం మరో అంశంగా కనిపిస్తున్నది. సోమవారం జరిగే నిరసనకు సంబంధించి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపిన ఆహ్వానం, వారితో జరిపిన చర్చలు బయటకు రాకపోవడంతో ఎంపీ అర్వింద్ మంత్రి వేములను గట్టిగా టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలతో వారి భుజం మీదా తుపాకీ పెట్టి వారినే టార్గెట్ చేశాడనే చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story