అర్థరాత్రి మాటువేసిన ఎమ్మెల్యే అనుచరులు.. నరికేస్తా అంటూ బీజేపీ నేతకు వార్నింగ్

by Shyam |   ( Updated:2021-08-02 05:51:27.0  )
BJP state leaders Ov Raju
X

దిశ, కోదాడ: బెదిరింపులతో రాజకీయ ఎదుగుదలను అడ్డుకోలేరని బీజేపీ రాష్ట్ర నాయకులు ఓవి రాజు అన్నారు. సోమవారం కోదాడ బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ‘దళితబంధు’ కోదాడ నియోజకవర్గ దళితులకు వర్తింపజేయాలని ర్యాలీ చేశామని, ఆ ర్యాలీ తీసినందుకు ఆదివారం రాత్రి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య అనుచరులు తనను బెదిరించారని అన్నారు. అనంతగిరి రోడ్డులో రాత్రి 10 : 30 గంటలకు తన నివాసానికి వెళ్తుండగా రోడ్డుపై మాటువేసి, ముగ్గురు వ్యక్తులు తన కారును రోడ్డుపై నిలిపి, మరోసారి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తే ‘నీ తల తీసేస్తా’ అని బెదిరింపులకు గురిచేశారని తెలిపారు. దీంతో చేసేదేంలేక వెంటనే కోదాడ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. బీజేపీలో ఉన్న ఒక్క రాజును బెదిరిస్తే వందమంది రాజులు ముందుకొస్తారని అన్నారు.

బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేవరకూ పోరాడుతామన్నారు. బెదిరింపులకు బీజేపీ కార్యకర్తలు బెదరని సూచించారు. ‘నా తల నరికేస్తే.. కోదాడలో నా విగ్రహం పెడతారా. మరణించినా నా పేరు సజీవంగా ఉంటుంది.’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి పూర్తి బాధ్యత కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌దే అని అన్నారు. నిందితులను వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, నడిగూడెం మండల అధ్యక్షులు దున్నా సతీష్, యువమోర్చా నాయకుడు ఏపురి గణేష్, పట్టణ మహిళా నాయకురాలు భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story