‘బండి’లో చోటేది.. ఆ లీడర్లకు మొండి చేయి

by  |
‘బండి’లో చోటేది.. ఆ లీడర్లకు మొండి చేయి
X

దిశ ప్రతినిధి,ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చోటు దక్కలేదు. జిల్లాలో ఎందరో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరికీ అధిష్టానం చాన్స్ ఇవ్వకపోవడంపై ఉమ్మడి జిల్లా కమలనాథులు ఆగ్రహంతో ఉన్నారు. దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని కొనసాగుతున్నా తమను అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రకటించిన రాష్ట్ర పార్టీ కార్యవర్గ జాబితాలో ఆదిలాబాద్ జిల్లా నేతలకు సంబంధించి ఒక్కరి పేరు కూడా లేకపోవడం గమనార్హం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి ఎందరో సీనియర్ నేతలు ఉన్నారు. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నేతలకు బండి సంజయ్ అవకాశం ఇవ్వలేదనే ఆరోపణలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాలుగు జిల్లాలుగా విడిపోయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర కార్యవర్గంలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అధిష్టానంతో తేల్చుకునేందుకు జిల్లా శ్రేణులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ఒక్కరికీ దక్కలే..

రాష్ట్ర కార్యవర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చాన్స్ వస్తుందని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేసినా వారి ఆశలు అడియాశలే అయ్యాయి. నిర్మల్ జిల్లా నుంచి రావుల రామనాథ్, అయ్యన్నగారి భూమయ్య, ఆడెపు సుధాకర్, ఒడిసెల శ్రీనివాస్, రవి పాండే, పడకండి రమాదేవి, రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎంపీ సోయం బాపురావు, నారాయణరెడ్డి, సుహాసినిరెడ్డి, పాయల శంకర్, ఆసిఫాబాద్ నుంచి పౌడేల్, మురళీధర్, శ్రీనివాస్ మంచిర్యాల జిల్లాలో మల్లారెడ్డి, గోనె శ్యామ్ సుందర్ రావులతో పాటు అనేక మంది ద్వితీయ శ్రేణి నేతలు పార్టీలో కొనసాగుతున్నారు. పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌తో పాటు కాంగ్రెస్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన నేతలు కూడా ఉన్నారు. అయినప్పటికీ ఏ ఒక్కరికీ రాష్ట్ర జాబితాలో చోటు ఇవ్వకపోవడంపై పార్టీ నేతలు పెదవి విరుస్తున్నారు.

అసమర్థ నాయకత్వమే కారణమా..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో అవకాశం ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో సీనియర్లు అయినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఒక్క నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో నేతలు సక్సెస్ కాలేదన్న అభిప్రాయంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు సెంటిమెంట్ బేస్డ్‌గా జరిగిన నేపథ్యంలోనే ఎంపీ సోయం బాపూరావు గెలిచారని పార్టీ అధిష్టానం అంచనా వేస్తోంది. ఆ తర్వాత జరిగిన మండల జిల్లా పరిషత్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా వెనకబడటం చూస్తే ఉమ్మడి జిల్లా నేతల అసమర్థతనే కారణమన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు పార్టీ అధిష్టానం ఇచ్చే ఆందోళన కార్యక్రమాలు విషయంలోనూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఫలితాలు అంతంతగా ఉన్నాయని అధిష్టానం ఒక నిర్ణయానికి రావడంతోనే రాష్ట్ర కార్యవర్గంలో ఎవరికీ చోటివ్వలేదని ప్రచారం జరుగుతున్నది. అవసరమైతే కాంగ్రెస్ బీజేపీలలో సీనియర్ నేతలను పార్టీలోకి ఆహ్వానించి వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం.

మోర్చాల్లోనూ దక్కని ఆవకాశం..!

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్య వర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు కీలకమైన రాష్ట్ర ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, అధికార ప్రతినిధి వంటి పోస్టులు ఏవీ దక్కలేదు. అయితే పార్టీ అనుబంధ రాష్ట్ర కార్యవర్గంలోనూ జిల్లా నేతలకు అవకాశం ఇవ్వకపోవడంపై వారు గుర్రుగా ఉన్నారు. యువజన, మహిళ, కిసాన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ, కార్మిక మోర్చాల్లోనూ కీలకమైన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వకపోవడం గమనార్హం. అయితే మరోసారి మోర్చా కార్యవర్గ విస్తరణ సమయంలో ఉమ్మడి జిల్లా నేతలకు చాన్స్ రావొచ్చని అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed