‘రిజర్వేషన్ల ఎత్తివేతకు బీజేపీ కుట్ర’

by Shyam |
‘రిజర్వేషన్ల ఎత్తివేతకు బీజేపీ కుట్ర’
X

దిశ, హైదరాబాద్ : రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కన్వీనర్, మాజీ ఎంపీ జితిన్ చౌదరి విమర్శించారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రెండురోజులుగా ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం జితిన్ చౌదరి విలేకరులతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అమలు ప్రాథమిక హక్కుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత సమాజంలో శతాబ్దాల తరబడి వెనుకబాటుతనం ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి విస్మరించారనీ, ఇది ముమ్మాటికీ సామాజికంగా వెనుకబడిన తరగతుల ప్రజలను కుంగదీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీలో షెడ్యూల్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను ఆయా ప్రభుత్వాలు తమ అభీష్టం మేరకే అమలు చేస్తున్నట్టు తెలిపారు. కోర్టులు ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకోవడం అంటే సామాజిక అంతరాలను, వెనుకబాటుతనాన్ని విస్మరించి.. ఆర్థికంగా ఎదిగిన వారిని, ఉన్నత వర్గాలను సమర్థించినట్టేనని అభిప్రాయపడ్డారు. డెబ్బై ఏళ్ళ భారత ఆర్థిక అభివృద్ధి గురించి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా.. దేశంలో సామాజిక వివక్ష ఇంకా ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కుట్రపూరిత చర్యలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో 16 రాష్ట్రాల ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, తొడసం భీంరావు, బండారు రవికుమార్, ధర్మానాయక్, అప్పల నర్స, పూర్నోబోరో, ఢిల్లీబాబుబ, శన్ముగం, విమల్ భగోరా, ప్రపుల్ లిండ, దిబోలినా హేంబ్రాం, బాల్ సింగ్, శంకరన్, ఎం.శోభన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story