బిహార్ సీఎం నితీష్ ఖంగుతినే పరిణామం

by Anukaran |
బిహార్ సీఎం నితీష్ ఖంగుతినే పరిణామం
X

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ నాలుగోసారి అధికార పగ్గాలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే ఖంగుతినే పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ దూకుడుగా చేసిన అవినీతి ఆరోపణలకు తాళలేక ప్రమాణం తీసుకున్న మూడు రోజులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేశారు. విద్యా శాఖ మంత్రి, జేడీయూ నేత మేవాలాల్ చౌదరి సీఎం నితీశ్ కుమార్‌ను కలిసి రాజీనామా లేఖను అందించారు. తనపై చేసిన ఆరోపణలకు ఇప్పటికీ చార్జిషీట్ ఫైల్ కాలేదని, కోర్టు తీర్పు రాలేదని మేవాలాల్ వ్యాఖ్యానించారు. ఆరోపణలతో కలత చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

2017లో భగల్‌పుర్ యూనివర్సిటీ వీసీగా మేవాలాల్‌ ఉన్నప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ సైంటిస్టు పోస్టుల నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు గుర్తుచేస్తూ ఆర్జేడీ నేత మనోజ్ ఝా నితీశ్ కుమార్ సర్కారుపై తీవ్రంగా దాడి చేశారు. సీఎం నితీశ్ కుమార్‌ సర్కారు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే పథకాలు ఎలా ఉండనున్నాయో తెలుస్తున్నదని ఆరోపించారు. 2017లో ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి నుంచి అవినీతి ఆరోపణలను సాకుగా చూసి రాజీనామా చేసిన నితీశ్ కుమార్ ఇప్పుడు అవే ఆరోపణలున్న నేతను తన మంత్రివర్గంలోకి తీసుకోవడం సీఎం కుర్చీపై ఆయనకున్న పదవీలాలసను వెల్లడిస్తున్నదని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed