పెద్దపులి సంచారం.. దానికోసమేనా..!

by  |
పెద్దపులి సంచారం.. దానికోసమేనా..!
X

ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతం నుంచి ఆవాసం కోసమే గోదావరి నది దాటి తెలంగాణలోకి పెద్దపులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి అడవులను జల్లెడ పడుతోందని చెప్తున్నారు. ఇటీవల మచ్చుపేట అడవుల్లో సంచరించి, పశువుల మందపై దాడి చేయగా.. మొత్తం ఐదు పులులు ఉన్నట్లు పశువుల కాపరి చెప్తున్నారు. దీంతో ఆఫీసర్లు పట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దిశ, కాటారం: మంథని నియోజకవర్గంలోని అటవీ ప్రాంతంలో ఆవాసం కోసం పెద్దపులి ఆరాటపడుతోంది. చత్తీస్​గఢ్​ అటవీ ప్రాంతం నుంచి గోదావరి నది దాటి తూర్పు అడవుల్లో ప్రవేశించిన పెద్దపులి జయశంకర్​ భూపాలపల్లి, పెద్దపల్లి అడవులను చుట్టేస్తోంది. మహాముత్తారం అడవుల్లో ఒక ఆవుపై దాడి చేసి చంపిన పులి ఈ ప్రాంతం నుంచి మల్హర్​ మండలం మీదుగా చిట్యాల మండలం నుంచి సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట అడవుల్లో పశువుల మందపై దాడి చేసింది. నేరుగా పులిని చూసిన పశువుల కాపరి రాజయ్య భయంతో పరుగులు పెట్టి షాక్​కు గురయ్యారు. మొత్తం ఐదు పులులు కనిపించాయని రాజయ్య అధికారులకు వివరించారు. తాజాగా కమాన్ పూర్ మండలం గుండారం సమీపంలో పులి కనిపించిందని స్థానికులు తెలిపారు. పెద్ద పులుల సంచారంతో అటవీ ప్రాంత సమీప గ్రామాల ప్రజలు వణుకుతున్నారు.

అంతా అలర్ట్​..!

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం అడవుల నుంచి మానేరు తీరం వెంట పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి మచ్చుపేట శివారులో గల బగుళ్లగుట్ట ప్రాంతంలో ఒక ఆవును చంపి, మరికొన్నింటిని గాయపర్చాయి. ఈ నేపథ్యంలో వాటి కదలికలపై పక్కాగా నిఘా పెట్టిన ఫారెస్టు అధికారులు డ్రోన్ కెమరాల సహాయంతో గుడిమెట్టు ప్రాంతంలో వీడియో తీయగా అందులో పులులు సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. ఈ నేపథ్యంలో గుడిమెట్టు పరిసర ప్రాంతాలైన మంథని మండలంలోని గాజులపల్లి, తోటగోపయ్యపల్లి, లక్కేపూర్, నగరంపల్లి, మహబూబ్ పల్లి, రామగిరి మండలంలోని రామయ్యపల్లి, రాజాపూర్, ఆదివారంపేట, బేగంపేట, నవాబుపేట గ్రామాలకు చెందిన రైతులు, పశువులు గొర్ల కాపర్లు, సాధారణ వ్యక్తులు ఎవరు కూడా అటవీ ప్రాంతంలో తిరగవద్దని అలర్ట్​ చేశారు. గుట్టకు సమీపంలో పొలాలు ఉన్న రైతులంతా ఒకేసారి వెళ్లి త్వరగా పని ముగించుకొని రావాలని సూచించారు.

హాని తలపెట్టొద్దు..

వన్యప్రాణులకు హాని తలపెట్టే చర్యలు ఎవరూ చేయవద్దని చెప్పారు. ఎవరైనా వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించే పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పులుల తాలూకా అడుగు జాడలను పసిగడితే వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించాలని కోరారు. బగుళ్లగుట్టతో పాటు అటవీ ప్రాంతంలో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పులి అడుగులను బట్టి పరిశీలిస్తే మాత్రం ఒకటేనని స్పష్టం అవుతోందని వెల్లడించారు. అయితే గురువారం కమాన్ పూర్ మండలం గుండారం పరిసరాల్లో కనిపించిన పులి రామగిరి ఖిల్లా మీదుగా మచ్చుపేట నుండి చేరుకుని ఉంటుందని భావిస్తున్నారు.

అటవీ ప్రాంతాల్లో సంచారం..

సరిహద్దు అటవీ ప్రాంతాన్ని చుట్టేస్తున్న పెద్దపులి ఆవాసం కోసమే ఈ ప్రాంతంలో సంచరిస్తోందని తెలుస్తోంది. చుట్టూ గుట్టలు, దట్టమైన అడవులు విస్తరించి ఉన్న చత్తీస్‌ఘడ్ నుంచి తూర్పు అటవీ ప్రాంతానికి చేరుకున్న పులి ఆవాసం కోసమే ఈ ప్రాంతంలో సంచరిస్తోందని అధికారులు భావిస్తున్నారు. అనువైన స్థలాన్ని ఎంచుకునేందుకే అడవులను జల్లెడ పడుతోందని చెప్తున్నారు.


Next Story