పాదయాత్ర చేస్తా.. కుంభం అనిల్ సంచలన ప్రకటన

by Shyam |   ( Updated:2021-08-04 08:06:18.0  )
Kumbam Anil Kumar Reddy
X

దిశ, భువనగిరి రూరల్: హుజురాబాద్ ఉప ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ‘దళితబంధు’ పథకం ప్రవేశపెట్టారని భువనగిరి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘దళితబంధు’ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ హర్షిస్తోందని, కానీ, ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తేనే అందరూ హర్షిస్తారు అని సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని నేటికీ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ముందు మూడెకరాల భూమి ఇప్పించాలని డిమాండ్ చేశారు. భూమి ఇస్తే దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. ఉప ఎన్నికల ముందే కేసీఆర్‌కు ప్రజలు గుర్తొస్తారని, ఇక్కడ కూడా భువనగిరి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నారు. భువనగిరి సమస్యలపై ఏనాడూ ఎమ్మెల్యే గళం విప్పి మాట్లాడింది లేదని విమర్శించారు.

భువనగిరి పట్టణ సమస్యలపై మరి కొద్ది రోజులలో పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9వ తేదీన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో లక్ష మందితో ‘దళిత దండోరా’ సభ నిర్వహిస్తున్నట్లు, ఈ సభకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో జిల్లా ప్రజలు తరలి వెళ్లనున్నట్లు తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 17 వరకు దళిత వాడలో పర్యటించి వారిని చైతన్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పట్టణ మండల అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, కోట పెద్దస్వామి, మాజీ పీసీసీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవికుమార్, నూతన డీసీసీ కార్యదర్శి మజహర్, జిల్లా నాయకులు నుచ్చు నాగయ్య యాదవ్, బెండ శ్రీకాంత్, ఎడ్ల శ్రీనివాస్, చిక్కుల వెంకటేశం, సిరికొండ శివకుమార్, కె సోమయ్య, వడిచర్ల కృష్ణ యాదవ్, బర్రె నరేష్, మంగ ప్రవీణ్, హారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed