కేసీఆర్ మొద్దు నిద్ర వల్లే ఆ సంఖ్య పెరుగుతోంది

by Aamani |
కేసీఆర్ మొద్దు నిద్ర వల్లే ఆ సంఖ్య పెరుగుతోంది
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణలో కరోనా కట్టడిలో కేసీర్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం డీసీసీ అధ్యక్షులు రామారావు పటేల్ తో కలిసి నిర్మల్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. అక్కడ రోగుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, పరీక్షలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అశ్రద్ధ వల్ల కొవిడ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోందని ఆరోపించారు. కరోనా బారిన పడిన బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంటే రోగులకు సేవలు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ను మొద్దు నిద్రలో నుంచి లేపేందుకే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆస్పత్రుల పర్యటన చేపట్టామన్నారు. రోగుల సంఖ్య పెరుగుతుందని, ప్రభుత్వ దవాఖానాలలో సౌకర్యాలు తగ్గుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రమణారెడ్డి, ముత్యం రెడ్డి అజర్ పాల్గొన్నారు.

Advertisement

Next Story