సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసిన ఎయిర్‌టెల్

by Harish |
Airtel
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసింది. సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ(ఏజీఆర్‌) బకాయిలకు సంబంధించి ఇటీవల వొడాఫోన్ ఐడియాతో కలిసి చేసిన విజ్ఞప్తిని అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చడంతో మరోసారి రివ్యూ పిటిషన్ వేసింది. గురువారం ఎయిర్‌టెల్ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏజీఆర్ బకాయిల లెక్కింపుల్లో పొరపాట్లు జరిగిన అంశంపై ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చిన కొద్ది రోజుల వ్యవధిలోనే వొడాఫోన్ ఐడియా సైతం టెలికాం విభాగం(డీఓటీ) ఏజీఆర్ లెక్కింపులను తనిఖీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎయిర్‌టెల్ సైతం కోర్టుకెళ్లినట్టు తెలుస్తోంది.

అయితే, దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏజీఆర్ బకాయిల్లో పొరపట్ల ఎయిర్‌టెల్ సంస్థ మొత్తం రూ. 43,980 కోట్లను చెల్లించాల్సి ఉందని పిటిషన్‌లో వివరించింది. ఎయిర్‌టెల్ సొంతంగా లెక్కించిన దాని ప్రకారం.. ఎయిర్‌టీల్ డీఓటీకి రూ. 13,004 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే రూ. 18 వేల కోట్లను చెల్లించామని ఎయిర్‌టెల్ చెబుతోంది. ఒకవేల ఈ రివ్యూ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరిస్తే టెలికాం కంపెనీలు క్యురేటివ్ అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వొడాఫోన్ ఐడియా ఇప్పటికే ఈ అంశాన్ని పరిశీలిస్తోందని సమాచారం. కాగా, ఇప్పటికే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ ఏజీఆర్ బకాయిల విషయంలో మరోసారి కోర్టుకెళ్లడంతో మరో టెలికాం సంస్థ టాటా టెలీసర్వీస్ కూడా రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా టెలీసర్వీసెస్ ఏజీఆర్ బకాయిల కింద రూ. 16,798 కోట్లను చెల్లించాల్సి ఉండగా, ఇందులో ఇప్పటికే రూ. 4,197 కోట్లను చెల్లించింది.

Advertisement

Next Story