‘భానుమతి రామకృష్ణ’.. టైటిల్ మారింది!

by Shyam |
‘భానుమతి రామకృష్ణ’.. టైటిల్ మారింది!
X

భానుమతి రామకృష్ణ అంటే.. ఈ తరానికి తెలుసో లేదో కానీ, ఆమె గురించి చెప్పాలంటే.. ఓ పుస్తకమే అవుతుంది. నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో ఓనర్, రచయిత, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా అన్నింట్లోనూ ఆమెకు ప్రవేశం ఉంది. నటనలో మేటి అనిపించుకున్న భానుమతి గాత్రానికీ సాటెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఆ మహానుభావురాలి ప్రస్థావన ఎందుకొచ్చిందంటే.. ప్రస్తుతం ఈమె పేరు మీద ఓ సినిమా వస్తోంది. అయితే, అది ఈమె బయోపిక్ మాత్రం కాదు. అసలు ఈమెకు ఆ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు.. ఒక్క పేరు తప్ప.

లెజండ‌రీ న‌టి భానుమ‌తి రామ‌కృష్ణ కొడుకు.. మ‌ద్రాస్ హైకోర్ట్‌లో ‘భానుమతి రామకృష్ణ’ చిత్ర బృందంపై కేసు వేశాడు. మా ఫ్యామిలీ అనుమ‌తి లేకుండా మా అమ్మ పేరు సినిమాకి పెట్టి మ‌మ్మ‌ల్ని అగౌర‌వప‌రిచార‌ని కోర్టుకు తెలిపారు. వివ‌రాల‌ను ప‌రిశీలించిన కోర్టు.. సినిమా టైటిల్‌ను మార్చాలని తెలిపింది. దీంతో చిత్రానికి ‘భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ’గా పేరు మార్చింది చిత్ర బృందం.

నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ అండ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమాలో.. గ్రామీణ నేపథ్యం కలిగిన అమాయకపు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌గా నవీన్ చంద్ర అల‌రించ‌నున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో రేపు(శుక్రవారం – జులై 3న) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో.. చిత్ర కొత్త ట్రైలర్‌ను యంగ్ హీరో నాని విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘30 ఏళ్ల వయసులో అందమైన ప్రేమ కథ’ అని నాని ట్వీట్ చేశారు. గురువారం విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లోనూ ‘భానుమతి అండ్ రామకృష్ణ’ గా పేరు మార్చారు.

Advertisement

Next Story