కాచుకొని కూర్చున్న నేతలు.. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికో ?

by Sridhar Babu |
కాచుకొని కూర్చున్న నేతలు.. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికో ?
X

దిశ, భద్రాచలం: టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీల్లో పదవులు దక్కని నాయకుల చూపు ఇపుడు జిల్లా కమిటీలపై పడింది. జిల్లా కమిటీలలో పదవులు కోసం పైరవీలు ఊపందుకున్నట్లుగా సమాచారం. అన్నిరకాల అర్హతలు, రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాల వలన మండల కమిటీలలో కీలక పదవులు పొందలేని ముఖ్య నాయకులకు జిల్లా కమిటీలో తప్పనిసరిగా పదవులు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కో మండలం నుంచి నలుగురైదుగురు నాయకులు జిల్లా పదవుల కోసం కాచుకొని కూర్చున్నారు. ఆ విధంగా భద్రాచలం నియోజకవర్గం పరిథిలోని చర్ల, దుమ్మగూడెం, భద్రాచలం మండలాల లిస్ట్ చాంతాడు అంత కనిపిస్తోంది. ఆశపడుతున్నవారిని సంతృప్తిపర్చడం జిల్లా పెద్దలకు కొంత తలకు మించిన భారమే అనడం అతిశయోక్తి కాదు. మండల కమిటీల్లో కీలక పదవుల కోసం నాయకులు గ్రూపులుగా‌ విడిపోయి గొడవలు పడినపుడు పదవులు రానివారికి జిల్లా కమిటీల్లో చోటు కల్పిస్తామని జిల్లా పెద్దలు హామీ ఇచ్చి బుజ్జగించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఇచ్చినమాట నిలుపుకొనే పనిలో పార్టీ పెద్దలు ఆలోచిస్తుండగా, జిల్లా కమిటీలో పదవులు కావాలని మరికొందరు నేతలు కొత్తగా తెరపైకి వస్తున్నారు. ఆ క్రమంలో పదవుల పైరవీలు జోరందుకున్నట్లు తెలుస్తోంది.

చర్ల నుంచి ఇద్దరు ఆశావాహులు
జిల్లా కమిటీలో పదవుల కోసం చర్ల మండలం నుంచి ఇద్దరు నేతలు పోటీపడుతున్నారు. గత మండల కమిటీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన బండి వేణుకి సరికొత్త సమీకరణాల వలన ఈసారి చర్ల మండల కమిటీలో చోటుదక్కకపోవడంతో ఆయనను జిల్లా కమిటీలోకి తీసుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. బీసీ (మున్నూరుకాపు) సామాజిక వర్గానికి చెందిన వేణుకి టీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం కల్పించాలని ఆ కులానికి చెందినవారు కోరుతున్నారు. ఇక బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు దొడ్డి తాతారావు కూడా జిల్లా కమిటీ పదవి ఆశిస్తున్నారు. తాతారావు ఉద్యోగ సమయంలో ఉత్తమ ఉపాధ్యాయునిగా, సామాజిక సేవకులుగా, ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులుగా పనిచేసి పటిష్ట నాయకత్వ లక్షణం, అందరిని కలుపుకొని పనిచేసేతత్వం ఉన్న నేపథ్యంలో చర్ల టౌన్‌లో పట్టు కలిగిన పద్మశాలి సామాజిక వర్గం నుంచి తాతారావుకి జిల్లా కమిటీలో చోటుకల్పించాలని కోరుతున్నారు.

దుమ్మగూడెంలో ఆ నలుగురు..
ఈ మండలంలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష పదవి కోసం అరడజను మంది పోటీపడ్డారు. పూర్వపు అధ్యక్షుడు అన్నెం సత్యనారాయమూర్తినే రెండవసారి అధ్యక్ష పదవి వరించడంతో మిగిలిన వారంతా భంగపడ్డారు. కొత్తూరు సీతారామారావు, పూజారి సూర్యచంద్రరావు, బత్తుల శోభన్‌బాబు, శివరామ కృష్ణ తదితరులు అధ్యక్ష పదవి ఆశించారు. గ్రూపులు వేరైనా వీరంతా మండలంలో ముఖ్య నాయకులు కావడంతో వీరిలో అసంతృప్తిని తొలగించడానికి కొందరికైనా జిల్లా కమిటీలో స్థానం కల్పించక తప్పదు. జిల్లా పదవుల కోసం ఎవరికి వారే జిల్లా పెద్దల దగ్గర లాబీయింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ మండలంలో రాజకీయ అనుభవం కలిగిన నాయకుల సేవలను పార్టీ పెద్దలు ఎలా ఉపయోగించుకుంటారనేది ఆసక్తిగా ఉంది.

భద్రాచలంలో పదవుల పంపిణీ బహుకష్టమే..!
భద్రాచలంలో నాయకుల నడుమ దూరం మరింతగా పెంచాయి.‌ కొత్త కమిటీ ఏర్పాటులో పదవి కోల్పోయిన మాజీ అధ్యక్షుడు యశోద నగేశ్‌తోసహా మరికొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరికి జిల్లా కమిటీలలో స్థానం కల్పిస్తే తప్ప అసంతృప్తి తొలిగేలాలేదు. గ్రూపులకు నిలయమైన భద్రాచలంలో పదవుల పంపిణీ ఓ విధంగా జిల్లా, రాష్ట్ర పార్టీ పెద్దలకు బహుకష్టమనే చెప్పాలి. ఇక్కడ నడిచే నాయకుల కంటే నడిపించే నాయకులకు తగిన ప్రాధాన్యత లభించినపుడే అంతర్గత విభేదాలు సద్దుమణిగే అవకాశం నెలకొంది.

Advertisement

Next Story