కరోనా సమయంలో వీరి ఆస్తులు ఆమాంతం..?

by Harish |
కరోనా సమయంలో వీరి ఆస్తులు ఆమాంతం..?
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా కుప్పకూలాయి. అనేక కంపెనీలు, వ్యాపారులు ఆదాయాలను కోల్పోయారు. అయితే, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, ఫెస్ బుక్ సృష్టికర్త జుకర్ బర్గ్ వంటి అమెరికన్ల సంపద భారీగా పెరిగింది. వీరి సంపద సుమారు 10 శాతం పెరిగినట్టు ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్(ఐపీఎస్) వెల్లడించింది. ఓవైపు అనేకమంది ఉద్యోగాలు కోల్పోయి, కంపెనీలు నష్టాలతో ఇబ్బందులు పడుతుంటే కొన్ని సంస్థల స్టాక్స్ పెరగడం, కొందరు బిలినియర్ల సంపద పెరగడం వెనక భిన్న అంశాలున్నాయని నివేదిక చెబుతోంది. ప్రస్తుత సంవత్సరం జనవరి 1 నుంచి ఏప్రిల్ 10వ తేదీ మధ్య కాలలో 34 మంది సంపన్నులు తమ నికర విలువను మిలియన్ల కొద్దీ పెంచుకున్నారు.

వీరిలో జెఫ్ బెజోస్, జూమ్ వీడియో కమ్యూనికేషన్ ఫౌండర్ ఎరిక్ యాన్, ఫేస్‌బుక్ అధినేత జకర్ బర్గ్, టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సహా ఎనిమిది మంది బిలియనీర్ల సంపద భారీగా పెరిగింది. అమెజాన్ స్టాక్స్ ఈ సంవత్సరంలోనే 31 శాతం లాభాలను నమోదు చేశాయి. లాక్‌డౌన్ వల్ల ప్రజలు ఇంటికే పరిమితమై ఆర్డర్ చేయడం వల్ల ఆన్‌లైన్ సేవలు పెరిగి అమెజాన్‌కు భారీగా లాభాలొచ్చాయి. దీంతో జెఫ్ బెజోస్ సంపద 147.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే, టెస్లా షేర్లు సైతం భారీగా పెరిగాయి. ఎలన్ మస్క్ సంపద కేవలం నెలల వ్యవధిలో 1 బిలియన్ డాలర్లు పెరిగింది. ఫేస్‌బుక్ కూడా భారీ లాభాలను నమోదు చేయడంతో జకర్ బర్గ్ ఆస్తులు 89 బిలియన్ డాలర్లు పెరిగాయి. కరోనా కాలంలో అమెరికన్ బిలియనీర్ల సంపద మొత్తం నికర విలువ మార్చి నుంచి మే మధ్య కాలానికి 434 బిలియన్ డాలర్లు పెరిగినట్టు ఐపీఎస్ నివేదిక పేర్కొంది. భారత కరెన్సీలో ఇది రూ. 32.97 లక్షల కోట్లుగా లెక్కగట్టచ్చు. అయితే, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, బెర్క్ షైర్ హాథ్‌వే వారెన్ బఫెట్ తక్కువ లాభాలను సాధించారు. బిల్‌గేట్స్ 8.2 శాతం, వారెన్ బఫెట్ 0.8 శాతం లాభాలకే పరిమితమయ్యారు.

Advertisement

Next Story