క్రికెటర్లకు 10నెలలుగా జీతాల్లేవ్..

దిశ, స్పోర్ట్స్: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. ఒక దేశానికే చెందిన క్రికెట్ బోర్డు అయినప్పటికీ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)నే ప్రభావితం చేసేంత శక్తిమంతమైనది. అలాంటి క్రికెట్ బోర్డు గత కొన్నేళ్లుగా పాలనా పరంగా విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో బోర్డు జాప్యం చేస్తుండటం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖజానాలో పుష్కలంగా డబ్బులు ఉన్నా, గత 10నెలలుగా అంతర్జాతీయ క్రికెటర్లకు జీతాలు చెల్లించలేదు. ఒక జాతీయ దినపత్రిక బోర్డు నిర్వాకాన్ని బయట పెట్టింది. గతేడాది అక్టోబర్ నుంచి బీసీసీఐ కాంట్రాక్టు కలిగిన 28మంది క్రికెటర్లకు రూ.130కోట్ల వరకు బాకీ పడినట్లు తేలింది. వీటిలో వేతనాల బకాయిలే రూ.99 కోట్లు ఉండగా, మ్యాచ్ ఫీజులతో కలుపుకొని రూ.130 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ డబ్బులు ఎప్పుడు చెల్లిస్తారో కూడా తెలియడం లేదని ఓ క్రికెటర్ మీడియా దగ్గర వాపోయాడు.

గంగూలీ హయాంలోనే..

సుప్రీంకోర్టు నియమించిన పాలక మండలి రద్దైన తర్వాత 2019 అక్టోబర్‌లో అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ, కార్యదర్శిగా జై షా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచే క్రికెటర్ల జీతాలు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. బీసీసీఐ ఎలైట్ కాంట్రాక్ట్ ఉన్న 27మంది క్రికెటర్లు వేతనాలే కాకుండా, గతేడాది డిసెంబర్ నుంచి ఆడిన 2 టెస్టులు, 9 వన్డేలు, 8 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు సంబంధించిన ఫీజులూ చెల్లించలేదని సమాచారం. బీసీసీఐ ఏ+ గ్రేడ్ కాంట్రాక్టులో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలకు ఏడాదికి రూ.7కోట్లు చెల్లిస్తున్నారు. అలాగే ‘ఏ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, ‘బి’ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.3కోట్లు, ‘సీ’ గ్రేడ్‌ ఆటగాళ్లకు రూ.కోటి చొప్పున వేతనంగా చెల్లిస్తున్నారు. కొంతకాలం క్రితమే ఈ కొత్త కాంట్రాక్టులు బీసీసీఐ ఇచ్చింది. గత డిసెంబర్‌లో బీసీసీఐ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంతోష్ రంగ్నేకర్ రాజీనామా చేసిన దగ్గర నుంచి పలు చెల్లింపులు నిలిచిపోయాయి. ఇటీవలే సీఈవో, జనరల్ మేనేజర్లును కూడా బోర్డు తప్పించడంతో వీళ్లు జీతాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

ఎలా చెల్లిస్తారు?

బీసీసీఐ తమ కాంట్రాక్టు క్రికెటర్లకు మూడు నెలలకు ఒకసారి వేతనాన్ని చెల్లిస్తుంది. ముందుగా క్రికెటర్లకు ఇన్‌వాయిస్ రెయిజ్ చేయడానికి ఒక మెయిల్ పంపుతుంది. దీనికి సమాధానంగా క్రికెటర్ల తమ వేతనం, మ్యాచ్ ఫీజులకు సంబంధించిన ఇన్‌వాయిస్ పంపగానే, దాన్ని పరిశీలించి చెల్లింపులు చేస్తుంటారు. అయితే 10నెలలుగా బీసీసీఐ నుంచి వేతనాల చెల్లింపులకు సంబంధించిన ఒక్క ఈ-మెయిల్ కూడా రాలేదని ఒక కాంట్రాక్ట్ క్రికెటర్ తెలిపారు. కొత్త కాంట్రాక్టులు జారీ చేసిన దగ్గర నుంచి అసలు వేతనాలే ఇవ్వలేదని సదరు క్రికెటర్ వాపోయాడు. గత నెలలో మాత్రం న్యూజీలాండ్ పర్యటనకు సంబంధించిన ఇన్‌వాయిస్ పంపమని లేఖ వచ్చిందని, కానీ ఇంత వరకు ఆ సొమ్ము మాత్రం జమ కాలేదని చెప్పుకొచ్చాడు. కేవలం అంతర్జాతీయ క్రికెటర్లకే కాకుండా, ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు, ఏజ్ గ్రూప్ క్రికెట్లరకు కూడా జీతాల చెల్లింపుల్లో ఆలస్యం అవుతున్నట్లు సమాచారం. బోర్డు వద్ద నిధులు ఉన్నా కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కారణంగానే జీతాలు చెల్లించలేకపోతున్నట్లు తెలుస్తున్నది.

ఏయే గ్రేడ్లలో ఎవరున్నారు?

బీసీసీఐ కొత్తగా 27మంది క్రికెటర్లకు గ్రేడ్లు జారీ చేసింది. వాటి వివరాలను పరిశీలించినట్లైతే..
ఏ+ గ్రేడ్
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బూమ్రా

ఏ గ్రేడ్
రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్

బి గ్రేడ్
వృద్దిమాన్ సాహ, ఉమేష్ యాదవ్, యజువేంద్ర చాహల్, హార్ధిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్

సీ గ్రేడ్
కేదార్ జాదవ్, నవదీప్ సైనీ, దీపక్ చాహర్, మనీష్ పాండే, హనుమ విహారి, శార్దుల్ ఠాకూర్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్

Advertisement