బంగ్లాదేశ్ బోర్డు కొత్త నిబంధన.. ఐపీఎల్ కోసమేనా?

by Shiva |
బంగ్లాదేశ్ బోర్డు కొత్త నిబంధన.. ఐపీఎల్ కోసమేనా?
X

దిశ, స్పోర్ట్స్ : బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ (బీసీబీ) ఆటగాళ్ల కోసం సరికొత్త నిబంధన తీసుకొని వచ్చింది. తమ దేశ క్రికెటర్లు ఇకపై ఐపీఎల్ వంటి ఇతర లీగ్స్ ఆడాలనుకుంటే ఈ నిబంధన అడ్డుపడనుంది. ఇటీవలే నిషేధం ముగించుకొని తిరిగి క్రికెట్ ఆడుతున్న బంగ్లా మాజీ కెప్టెన్ షకీబుల్ హసన్ ఉదంతం నేపథ్యంలో ఈ నిబంధన తీసుకొని వచ్చినట్లు తెలుస్తున్నది. ఏప్రిల్ నెలలో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడాల్సి ఉన్నది. అయితే తనను ఆ సమయంలో ఐపీఎల్ ఆడటానికి అనుమతి ఇవ్వాలని షకీబుల్ బీసీబీని అనుమతి కోరాడు. జాతీయ జట్టు కీలక సిరీస్ ఆడే సమయంలో తాను జట్టుకు దూరంగా ఉంటానని అతడు కోరడంపై బీసీబీ ఫైర్ అయ్యింది. దీంతో ఆటగాళ్ల వార్షిక ఒప్పందాల్లో సరికొత్త నిబంధనను తీసుకొని వచ్చింది.

‘ఇకపై ఏ ఆటగాడైనా వార్షిక ఒప్పందంపై సంతకం చేసే ముందు.. ఆ ఏడాది ఏయే ఫార్మాట్లు ఆడాలనుకుంటున్నారో ముందుగానే తెలియజేయాలి. ఏడాదిలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందుబాటులో ఉంటారో పేర్కొనాలి. ఇకపై ఇతర లీగ్స్‌లో పాల్గొనాలంటే వ్యక్తిగత నిర్ణయం తీసుకోకూడదు. ఇలా సంతకం చేయడం ద్వారా వారు భవిష్యత్‌లో జాతీయ జట్టుకు ఎంతకాలం అందుబాటులో ఉంటారనేది తెలిసిపోతుంది. మేం వారిని బలవంతంగా లీగ్స్‌లో పాల్గొనకుండా ఆపామనే అపవాదు కూడా ఉండదు’ అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ అన్నారు. షకీబుల్ ఐపీఎల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. అతడికి మేం ఆపదలచుకోలేదు. ఎవరికైతే దేశం కోసం ఆడాలని అనుకుంటారో అలాంటి వాళ్లే మాకు కావాలని నజ్ముల్ స్పష్టం చేశారు. కాగా, ఇటీవల జరిగిన మినీ వేలంలో షకీబుల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Next Story