వారికి బతుకమ్మ చీరలు అందనట్లే ?

by Shyam |   ( Updated:2021-10-07 23:17:24.0  )
వారికి బతుకమ్మ చీరలు అందనట్లే ?
X

దిశ, సిటీబ్యూరో: పేద మహిళలకు ఇచ్చే బతుకమ్మ చీరలు నగరంలో అందరికీ అందేలా లేవు. మొత్తం ఎఫ్‌ఎస్ కార్డులు 17 లక్షలు ఉండగా.. 8.9 లక్షల మందికే చీరలు పంపిణీ చేయడంపై చర్చనీయాంశం అయింది. ఫుడ్ సేఫ్టీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరలను అందించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. కేవలం 8,90,019 చీరలు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు ఎందుకు చీరలు ఇవ్వరని పేద ప్రజలు, విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు.

Bathukamma Sarees

పండుగలకు పేదలకు ఇచ్చే కానుకలపై ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పేదలకు సర్కారు పంపిణీ చేస్తున్న బతుకమ్మ చీరలు గ్రేటర్‌లోని ఫుడ్‌సేఫ్టీ సెక్యూరిటీ కార్డుదారుల్లో కేవలం సగం మందికి మాత్రమే పంపిణీ చేయడంపై నగరవాసుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి సుమారు 17 లక్షల మంది ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ రేషన్ కార్డు దారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కేవలం 8.9 లక్షల మందికి మాత్రమే చీరలను పంపిణీ చేయడం చర్చనీయాంశం అయింది. మిగతా జిల్లాల్లో చీరల పంపిణీ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించగా, హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో ఈ బాధ్యతను జీహెచ్ఎంసీ తీసుకుంది.

8.9 లక్షల చీరలు..

మొత్తం గ్రేటర్‌లో 8లక్షల 90 వేల 19 చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించి, గత నెల 30వ తేదీ నాటికి 4లక్షల 82 వేల 120 చీరలను బల్దియాకు సర్కారు అందించింది. వీటిని 631 రేషన్ షాపుల ద్వారా సుమారు 506 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి, చీరలను పంపిణీ చేస్తున్నారు. కానీ ఫుడ్ సేఫ్టీ సెక్యూరిటీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ బతుకమ్మ చీరలను అందించనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. కేవలం 8లక్షల 90 వేల 19 చీరలు మాత్రమే కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు ఎందుకు చీరలు ఇవ్వరని, ఏ పాపం చేశారని పేద ప్రజలు, విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది కేవలం 6లక్షల మందికే చీరలు పంపిణీ చేశారు. కాగా, గురువారం ఒక్క రోజే లక్ష చీరలను పంపిణీ చేయగా, ఈ నెల 2 నుంచి ఇప్పటి వరకు మొత్తం జిల్లాలో 5.79 లక్షల చీరలను పంపిణీ చేసినట్లు బల్దియా అధికారులు వెల్లడించారు. నగరంలోని 30 గోదాములను ఏర్పాటు చేసి వాటి నుంచి ప్రత్యేక పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసి ఈ చీరలను పంపిణీ చేస్తున్నారు.

ఇష్టారాజ్యంగా పంపిణీ..

కుల, మత, రాజకీయాలకు అతీతంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని పాలకులు చెబుతుంటే, క్షేత్ర స్థాయిలో అధికార పార్టీకి చెందిన నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతల కుటుంబ సభ్యులు, వారి బంధువులు, వారు రికమెండ్ చేసిన వారికి మాత్రమే చీరలను ఇస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు తమ బస్తీలు, మురికివాడల్లోని పేదలకు బతుకమ్మ చీరలు అందలేదని ప్రశ్నించగా, ఏ పార్టీకి ఓటు వేశారు? అని అధికార పార్టీకి చెందిన నేతలు బహాటంగానే వ్యాఖ్యానిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక బల్దియా అధికారులకు ఈ విషయాన్ని చెప్పినా, వారు మౌనం వహిస్తున్నట్లు మహిళలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed