- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గబ్బిలాన్ని శత్రువులా చూడొద్దు!
జంతువులంటే మాకిష్టం అంటూ పోస్టులు పెట్టే వారు కూడా గబ్బిలాన్ని చూస్తే ఈసడించుకుంటారు. పాపం అదంటే అందరికీ అలుసే. అధిక వ్యాధి నిరోధక శక్తి ఉండటం దాని తప్పు కాదు కదా! పైగా ప్రతి వైరస్‌కు అదే కారణమంటూ అభాండాలు వేస్తున్నారు. మరి మిగతా జంతువుల మీద వైరస్‌లు ఉండవా? వాటి నుంచి మనుషులకు వైరస్ సోకదా? అయినా వైరస్‌లన్నింటికీ గబ్బిలాలే కారణమని వచ్చే వార్తలన్నీ ఊహాగానాలు మాత్రమే. నిజంగా పరిశోధించి చూస్తే వాటిలో ఉన్న వైరస్‌కు, మానవులకు వ్యాపిస్తున్న వైరస్‌కు చాలా తేడాలున్నాయి. కానీ మీడియా, సోషల్ మీడియా కారణంగా గబ్బిలాలు ఆ అపవాదును మోస్తున్నాయి. రాత్రిపూట తప్ప పగలు పెద్దగా కనిపించని ఈ ఎగిరే క్షీరదాలను కరోనా వైరస్ తాకిడి తర్వాత జనాలు వెతికి మరీ చంపుతున్నారు. గబ్బిలాలకు తెలియదు.. అవి వైరస్‌ను వ్యాప్తి చెందిస్తున్నాయని.. కానీ ప్రభుత్వాలు, మీడియా గొంతెత్తి చెబుతున్నా పట్టించుకోకుండా నిబంధనలు బేఖాతరు చేస్తూ వైరస్ వ్యాప్తిని పెంచుతున్న మనుషులకు తెలుసుకదా? మరి ఇక్కడ పెద్ద తప్పు చేస్తున్నది ఎవరు? అందుకే గబ్బిలాలను ఈసడించుకోవడానికి ముందు వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అవి ఎంత మేలు చేస్తున్నాయో తెలుసుకోవాలి.
పూర్వకాలం నుంచే మనుషులతో స్నేహం
‘ఆదిమానవుడు గుహల్లో నివసించెను’ అని ఆరో తరగతి సోషల్ పుస్తకాల్లో చదువుకున్నాం కదా! మరి ఆ గుహల్లో మనిషి మాత్రమే ఉన్నాడా? తోడుగా గబ్బిలాలు లేవా? ఆహారం కోసం గబ్బిలాలను కాల్చుకుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ గబ్బిలాలను తింటున్నారు. మరి ఆ ప్రాంతాల్లో ఉన్న గబ్బిలాల మీద వైరస్‌లు లేవా? మనిషి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక ఎరువుల అవసరం ఏర్పడింది. అప్పుడు కూడా గబ్బిలాలే ఆదుకున్నాయి. మనిషి గుహల నుంచి బయటికి వచ్చి నివాసాలు ఏర్పరుచుకున్నా.. గబ్బిలాలు మాత్రం గుహల్లోనే ఉండిపోయాయి. ఆ గుహల్లోని గబ్బిలాల మలాన్ని ఎరువుగా వాడి పంటలు పండించుకున్నారు. కానీ పండిన పంటలకు చిట్టెలుకల బెడద వచ్చింది. ఏపుగా పెరిగిన పంటను, దాచుకున్న ధాన్యాన్ని అవి నాశనం చేశాయి. అప్పుడు కూడా గబ్బిలాలే రంగంలోకి దిగి మానవుడిని కాపాడాయి. రాత్రి పూట యుద్ధసైనికుల్లా పంట మీద పడి కనపడిన ప్రతి నాశనకారిని గబ్బిలాలు దూరం చేశాయి. సుందరవనాల్లో మాంగ్రూవ్ చెట్లలో పరాగసంపర్కానికి ప్రధాన కారణం గబ్బిలాలే. ఈ మాంగ్రూవ్ వనాల వల్ల కలిగే లాభాలేంటో సునామీ బాధిత ప్రాంతాలను అడిగితే తెలుస్తుంది. అలా మానవ జీవితం ప్రారంభమైన నాటి నుంచి గబ్బిలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం శత్రువులయ్యాయి.
గబ్బిలాలే ఎందుకు టార్గెట్?
ప్రపంచవ్యాప్తంగా 1400 గబ్బిలాల జాతులు ఉన్నాయి. వీటిలో మూడో వంతు జాతులు అంతరించే స్థాయిలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకటించింది. గబ్బిలాలకు వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ. అన్ని జంతువుల మీద ఉన్నట్లుగానే గబ్బిలాల మీద కూడా వైరస్‌లు ఉంటాయి. కానీ ఈ వైరస్‌లు గబ్బిలాలను ఏం చేయలేవు. కాబట్టి వాటికి వ్యాధులు రావు. వైరస్ మాత్రం గబ్బిలం మీద జీవిస్తూ తన సంఖ్యను రెట్టింపు చేసుకుంటుంది. గబ్బిలానికి ఉన్న వ్యాధి నిరోధక శక్తి దానికి వ్యాధి రాకుండా కాపాడుతుంది కానీ వైరస్‌ను అంతం చేయలేదు. అందుకే వైరస్ దాని శరీరం మీద వృద్ధి చెందుతుంది. ఎలాగూ జాతుల సంఖ్య ఎక్కువ కావడం, గబ్బిలాలు గుంపులు గుంపులుగా తిరగడం మూలాన వైరస్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆ వైరస్ ఏదో ఒక సమయంలో మానవులకు వ్యాపిస్తుంది. అందుకే కొత్తగా పుట్టుకొచ్చిన ప్రతి వైరస్‌కు గబ్బిలాలనే ముందు పరీక్షిస్తారు.
పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
గబ్బిలాల మీద పెద్ద సంఖ్యలో వైరస్‌లు ఉన్నమాట నిజమే.. కానీ మానవులకు హాని కలిగిస్తున్న వైరస్‌లు, గబ్బిలాల మీది వైరస్‌లకు చాలా తేడా ఉంటోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు కరోనా వైరస్ తీసుకుంటే గబ్బిలాల్లో కనిపించిన కొవిడ్, మానవులకు వ్యాపిస్తున్న కొవిడ్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే కొన్ని దశాబ్దాల కిందటే గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉంది. అంతేకాకుండా గబ్బిలాల నుంచి శాంపిల్ తీసుకుని పరీక్షించడం సులభం. ఎలాగూ ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఇష్టం వచ్చిన సంఖ్యలో శాంపిళ్లు తీసుకోవచ్చు. ఆ శాంపిళ్లలో వైరస్ ఉన్నట్లు తెలుస్తుంది. అది తెలియడమే ఆలస్యం వైరస్ గబ్బిలాల నుంచే వస్తుందని వార్తలు వస్తాయి. పాపం అవి బలవుతాయి. కరోనా వైరస్ ప్రారంభంలో నాగుపాముల నుంచి కూడా వచ్చిందని, చైనీయులు వాటిని తినడం వల్లే వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ నాగుపాముల నుంచి శాంపిళ్లు తీయడం కష్టమైన పని. కాబట్టి వాటి మీద పరిశోధనలు చేయరు. దీంతో వాటిలో వైరస్ లేదని వార్తలు పుట్టిస్తారు. ఏమో నాగుపాముల్లో గబ్బిలాల కంటే ఎక్కువ వైరస్‌లు ఉండొచ్చేమో.
చివరగా చెప్పేదేంటంటే, సులువుగా దొరికింది కదా అని గబ్బిలాన్ని బ్లేమ్ చేయడం మానేసి, నిజమైన సమస్య మీద దృష్టి సారించాలి. గబ్బిలాలంటే వాటికి తెలియక వైరస్‌ను వ్యాప్తిచేశాయి. కానీ ఒక మనిషిగా అన్ని తెలిసుండి కూడా సామాజిక దూరం పాటించకుండా, శానిటైజర్ రుద్దుకోకుండా, మాస్క్ ధరించకుండా వైరస్‌ను నలుగురికి అంటించి, దానికి మూగజీవాలను బాధ్యులను చేయడం సరికాదు. అవసరమైతేనే బయటికి రండి, కుదిరితే ఇంటి దగ్గరి నుంచే పనిచేయండి. ప్రాణం ముఖ్యం, మనపై ప్రాణాలు పెట్టుకున్నవారు ముఖ్యం.. అలాగే గబ్బిలాలు కూడా ముఖ్యమే!