చవితి సంబురంలో ముచ్చర్ల.. అంతలోనే కలవరం

by  |
చవితి సంబురంలో ముచ్చర్ల.. అంతలోనే కలవరం
X

దిశ, న్యూస్ బ్యూరో: ఫార్మా సిటీ పరిధిలోని గ్రామాల పరిధిలోని పంట పొలాలలో మళ్లీ భూ సేకరణ దిమ్మలు వెలియడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రంగారెడ్డి జిల్లా రైతాంగం ఇప్పటికే హైదరాబాద్ ఫార్మా సిటీ కుంపటిని మోస్తోంది. 19,333 ఎకరాలు, 78.24 చ.కి.మీ. విస్తీర్ణంలో ప్రభుత్వం ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తోంది. ఇది కందుకూరు, యాచారం, కడ్తాల మండలాల్లోనే అధిక భాగం ఉంటుం ది. భూ సేకరణను దాదాపు పూర్తి చేశారు. ముచ్చర్ల, కుర్మిద్ద, మర్లకుంట తండ, సాయిరెడ్డిగూడెం, ఉట్లపల్లి గ్రామాలలో మళ్లీ దిమ్మలు వెలిశాయి. కాలుష్య కాసారాన్ని మోసేందుకు సిద్ధపడిన గ్రామాలనే మళ్లీ మళ్లీ ఇక్కట్లకు గురి చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఐదు కి.మీ. మేర ఈ పిల్లర్లను పాతడం వెనుక ఆంతర్యమేమిటో అర్ధం కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. రెవెన్యూ అధికారులు, టీఎస్ఐఐసీ అధికారులెవరూ స్పందించడం లేదు. అందరూ వినాయక చవితి పండుగ సంబురంలో ఉంటే, ఈ గ్రామాల రైతులు మాత్రం కలవరంలో ఉన్నారు. అధికారులు ఫోన్లు ఎత్తడం లేదు. మెసేజ్లకు రిప్లయి ఇవ్వడం లేదు. కందుకూరు తహశీల్దార్, ఆర్డీఓలు బదులు ఇవ్వడం లేదు. కనీసం ఎందుకు మా ర్కింగ్ చేశారో చెబితే కొంతయినా ఊపిరి పీల్చుకుంటామని గ్రామస్థులు అంటున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలను అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి సమర్పించాం. అయినా, కొత్త కొత్త భయా లను సృష్టిస్తున్నారని వారు ‘దిశతో వాపోయారు. మిగిలిన కాస్త భూములను కూడా గుంజుకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు.

కురుమిద్ద నుంచి హైవే వరకు

కురుమిద్దా హెచ్ పీ పెట్రోల్ పుంపు నుంచి మర్లకుంట తాండ, సాయిరెడ్డిగూడ, ఉట్లపల్లి, ముచ్చర్ల పంట పొలాల నుంచి శ్రీశైలం హైవే, ముచ్చర్ల గేట్ నుంచి కడ్తాల్ వరకు సిమెంట్ పిల్లర్లు పాతారు. సిమెంట్ దిమ్మలు పోతుబండ, మర్లకుంట తండా మొదలుకొని ముచ్చర్ల సర్వే నం.155 నుంచి మొదలుకొని 141, 150, 149, 307, 376, 379, 393, 401 గుండా శ్రీశైలం హైవే వరకు, ముచ్చెర్ల క్రాస్ రోడ్ నుంచి 500 మీటర్లకు ఒకటి, కొన్ని చోట్ల 200, 300 మీటర్ల దూరంలో నాటారు. కడ్తాల్ రెవెన్యూ శ్రీశైలం హైవే వరకు పాతారు. ఎవరు పాతారన్న విషయంపై రైతులకు ఎలాంటి సమాచారం లేదు. ఫార్మా సిటీ కోసమేనా? మరో కొత్త ప్రాజెక్టు వస్తుందా అన్నది కూడా అంతుచిక్కక అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాలు కోల్పో యిన రైతాంగం అనుకోని ఈ ఉపద్రవంతో దిగులు పడుతోందని కందుకూరు కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ చైర్మన్, పీఏసీఎస్ డైరెక్టర్ సత్తినేని వెంకటరాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సమాధానం చెప్పడం లేదని కుర్మిద్ద సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. తక్కువ ధరకే సారవంతమైన భూములను గుంజుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పరిహారం సరిపోలేదంటూ రైతులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉండగానే, మరో కుంపటిని రుద్దేందుకు ప్రయత్నిస్తుండడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. శనివారం ఫార్మా సిటీపై మంత్రి కేటీ రామారావు సమీక్ష నిర్వహించి భూ నిర్వాసిత కుటుంబాలలో ఒకరికి ఉద్యోగాలు ఇచ్చేందుకు జాబితా తయారు చేయాలని ప్రతిపాదించారు. ఈ క్రమంలో రాళ్లను పాతడమేమిటో తెలియడం లేదని రైతుల ఆవేదనగా ఉంది.


Next Story

Most Viewed