ఇంగ్లాండ్ అభిమానుల సంఘం.. ‘బర్మీ ఆర్మీ’

by Shiva |
ఇంగ్లాండ్ అభిమానుల సంఘం.. ‘బర్మీ ఆర్మీ’
X

దిశ, స్పోర్ట్స్ : క్రికెటర్లకు.. క్రికెట్ జట్లకు అభిమానులు ఉండటం సాధారణమే. సచిన్ టెండుల్కర్ ఆడే సమయంలో సుధీర్ అనే అభిమాని ఒళ్లంతా రంగులు పూసుకొని సచిన్ పేరు ఒంటిపై రాసుకొని త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ సందడి చేసేవాడు. సచిన్ రిటైర్ అయ్యాక కూడా ‘మిస్ యూ సచిన్’ అని రాసుకొని ప్రతీ మ్యాచ్ వీక్షించాడు. మ్యాచ్ ఎక్కడ జరిగినా వ్యయప్రయాసాలకు ఓర్చి స్టేడియానికి వెళ్లేవాడు. ఆ తర్వాత ధోనీకి కూడా ఒక ఫ్యాన్ తయారయ్యాడు.

కానీ వీళ్లంతా ఎవరికి వారే.. కానీ ఒక జట్టును సపోర్ట్ చేయడానికి ఏకంగా పదుల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలివస్తే? ప్రపంచంలోని ఏ దేశంలో తమ జట్టు ఆడినా అక్కడ వాలిపోతే? అలాంటి గ్రూప్ ఉంటుందా అంటే.. ఉంది అనే సమాధానం వస్తుంది. అదే ‘బర్మీ ఆర్మీ’. ఇంగ్లాండ్ జట్టు ప్రపంచంలో ఎక్కడ ఆడినా అక్కడ వాలిపోయే ఇంగ్లాండ్ అభిమానుల బృందమే ఈ ‘బర్మీ ఆర్మీ’. ఒక సాధారణ అభిమాన గ్రూప్‌గా ప్రారంభమైన ఈ బర్మీ ఆర్మీ ఇప్పుడు ఒక లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందంటే నమ్మశక్యం కాదు. మరి ఆ ఆర్మీ కథేంటో తెల్సుకోవాల్సిందే.

ఇంగ్లాండ్ జట్టంటే పిచ్చి..

ఇంగ్లాండ్‌కు చెందిన కొంత మంది అభిమానులు 1994-35 సీజన్ యాషెస్ చూడటానికి ఆస్ట్రేలియా వెళ్లారు. పాల్ బుర్హామ్ నాయకత్వంలో అక్కడకు వెళ్లిన ఒక బృందం ఆస్ట్రేలియా స్టేడియంలలో సందడి చేసేది. మ్యాచ్ గెలుపోటములతో సంబంధం లేకుండా వారు ఒకటే గోల చేసేవాళ్లు. దీంతో ఆస్ట్రేలియా మీడియా వీరికి ‘బర్మీ ఆర్మీ’ అని పేరు పెట్టింది. ఇంగ్లీష్‌లోని ఒక యాసలో ‘బర్మీ’ అంతే అమితమైన ప్రేమ లేదా పిచ్చి అని అర్థం. ఆస్ట్రేలియా మీడియాలో వీళ్లను బర్మీ ఆర్మీ అని సంభోదిస్తుండటంతో పాల్ బుర్హామ్ ఒక 50 టీషర్ట్స్ కొని దానిమీద ‘అథర్టన్స్ బర్మీ ఆర్మీ’ అని రాయించాడు. అథర్టన్ అప్పటి ఇంగ్లాండ్ కెప్టెన్. ఇక అప్పటి నుంచి ఈ బృందం ఎక్కడికి వెళ్లినా బర్మీ ఆర్మీ అనే పేరుతో టీషర్టులు ధరించి స్టేడియంలలో సందడి చేసేది.

మీడియాలో విస్తృతంగా పేరు రావడంతో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా బర్మీ ఆర్మీ క్రేజ్ మార్మోగిపోయింది. ఆ ఆర్మీలో జాయిన్ అవుతామని ఎంతో మంది ఇంగ్లాండ్ అభిమానులు వచ్చేవాళ్లు. దీంతో బర్మీ ఆర్మీ పేరుతో ఒక కంపెనీని స్థాపించాడు పాల్ బుర్హామ్. ఇంగ్లాండ్ జట్టు ఎక్కడికి వెళ్లినా ఆ పర్యటనకు అభిమానులను టూర్ ప్యాకేజీ మీద తీసుకొని వెళ్లడం.. వారికి టికెట్లు, ప్రయాణం, బస ఏర్పాట్లు చేయడం ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. లాభాల కోసం కాకుండా బర్మీ ఆర్మీ పేరుతో ఇంగ్లాండ్ అభిమానులను ఒక్కటిగా చేయడమే దీని లక్ష్యమని వ్యవస్థాపకులు చెబుతున్నారు. ఈ ఆర్మీలో సభ్యులే కాకుండా ఇతరులు కూడా బర్మీ ఆర్మీ టీషర్ట్స్ ధరించి స్టేడియంలలో సందడి చేస్తుండటం కొసమెరుపు.

చేపాక్‌లో సందడి..

కరోనా మహమ్మారి కారణంగా ఇంగ్లాండ్ ఆడిన ఒక్క మ్యాచ్‌కు కూడా అభిమానులను అనుమతించలేదు. ఇంగ్లాండ్‌లో జరిగిన పాకిస్తాన్, వెస్టిండీస్ సిరీస్.. శ్రీలంక పర్యటనలో కూడా అభిమానులు లేకుండానే మ్యాచ్‌లు జరిగాయి. అయితే ఏడాది తర్వాత చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టులో ప్రేక్షకులను అనుమతించారు. టీమ్ ఇండియా అభిమానులతో పాటు బర్మీ ఆర్మీ కూడా సందడి చేసింది. తమ అభిమాన క్రికెట్ జట్టు కోసం వేల కిలోమీటర్లు ప్రయానం చేసి.. కఠినమైన క్వారంటైన్‌లో ఉండి శనివారం గ్యాలరీల్లో సందడి చేశారు. కరోనా నిబంధనల వల్ల ఈ సారి ఎక్కువ మంది బర్మీ ఆర్మీ సభ్యులు రాలేకపోయారని వారు చెబుతున్నారు. ఏదేమైనా ఒక క్రికెట్ జట్టును అభిమానించే గ్రూప్ ఇంతగా పాపులర్ అవడం మరెక్కడా చూడము. బర్మీ ఆర్మీ స్పూర్తితో మరి కొన్ని ఆర్మీలు పుట్టుకొని వచ్చాయి. కానీ వీరి పాపులారిటీ ముందు మరే ఆర్మీ నిలువలేకపోయింది.

Advertisement

Next Story