‘జన్‌ధన్’.. డ్రా చేసే ధనాధన్!

by Shyam |
‘జన్‌ధన్’.. డ్రా చేసే ధనాధన్!
X

దిశ, నల్లగొండ: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) మహమ్మారి కట్టడికి విధించిన లాక్‌డౌన్ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా బ్యాంకులపై తీవ్రంగా పడింది. ఉమ్మడి జిల్లాలో ఇంచుమించు రూ.400 కోట్ల మేర జరిగే లావాదేవీలు నేడు రూ.70 కోట్లకు పడిపోయాయి. ఇందులోనూ బ్యాంకుల్లో నగదు జమ చేసే వారి సంఖ్య చాలా తక్కువ. డ్రా చేసుకునేవారే ఎక్కువగా బ్యాంకులకు వస్తున్నారు. ప్రధానంగా జన్‌ధన్ ఖాతాదారులే అధికంగా బ్యాంకులకు క్యూ కడుతున్నారు. సాధారణ రోజుల్లో బ్యాంకుల్లో డబ్బులు వేయాలన్నా, తీయాలన్నా గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చేది. ఒక్కో బ్యాంకులో రెండు మూడు కౌంటర్లు ఉన్నా.. అదే పరిస్థితి ఉండేది. కానీ, లాక్‌డౌన్ పుణ్యమా అంటూ లావాదేవీలు తగ్గి బ్యాంకులు బోసిపోయే పరిస్థితి ఏర్పడింది.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదీ పరిస్థితి..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 430 బ్యాంకులు ఉన్నాయి. లాక్‌డౌన్‌కు ముందు ఆయా బ్యాంకుల ద్వారా నిత్యం సుమారు రూ.388 కోట్ల లావాదేవీలు జరుగుతుండేవి. కానీ, కేంద్రం లాక్‌డౌన్‌ ప్రకటించిన తర్వాత రూ.75 కోట్లకు పడిపోయింది. వాస్తవ లెక్కల ప్రకారం.. లాక్‌డౌన్‌కు ముందు లక్షా 72 వేల మంది ఖాతాదారులు లావాదేవీలకు వస్తుండేవారు. ఒక్కో బ్యాంక్‌కు నిత్యం రూ.30 లక్షల డిపాజిట్లు సమకూరేవి. అదేవిధంగా బ్యాంకులు సుమారు రూ.60 లక్షల రుణాలు ఇచ్చేవి. మొత్తంగా బ్యాంకుల ద్వారా సుమారు నిత్యం రూ.388 కోట్ల నగదు లావాదేవీలు జరిగేవి. కానీ, లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన దగ్గరి నుంచి ఖాతాల్లో జమ కంటే చెల్లింపులే ఎక్కువ. ప్రస్తుతం కేవలం మెడికల్ దుకాణాల నుంచి మాత్రమే ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. రైస్‌మిల్లర్స్‌, మిర్చి, ధాన్యం వ్యాపారులు, జన్‌ధన్‌ ఖాతాదారులు మాత్రం అధిక సంఖ్యలో నగదును డ్రా చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎటువంటి రుణాల ఇచ్చే పరిస్థితి లేదని బ్యాంకింగ్ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా వచ్చే డిపాజిట్లు తక్కువ, నగదు చెల్లింపులు ఎక్కువగా ఉంటున్నాయని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మరో నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందంటున్నారు.

జన్‌‘ధన్’ ఖాతాదారుల క్యూ..

జన్‌ధన్‌ ఖాతాదారులు, రేషన్ కార్డు లబ్ధిదారులు బ్యాంకుల ముందు క్యూ కడుతున్నారు. ఖాతాల్లో జమ అయిన డబ్బు వెంటనే తీసుకోకపోతే వెనక్కి వెళ్లిపోతుందన్న తప్పుడు ప్రచారంతో వినియోగదారులు రూ.500, రూ.1,500 కోసం తెల్లవారుజామునుంచే బ్యాంకుల ఎదుట పడిగాపులు కాస్తున్నారు. ఒక్కసారి ఖాతాలో పడిన డబ్బు వెనక్కి పోదని ఎంత చెప్పినా విన్పించుకోవడంలేదు. ఈ క్రమంలో సామాజిక దూరాన్ని సైతం లబ్ధిదారులు విస్మరిస్తున్నారు. పైగా వేసవి కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో తిండితిప్పలు లేక బ్యాంకుల్లోని డబ్బు డ్రా చేసుకునేందుకు వస్తుండటంతో కళ్లు తిరిగి కిందపడిపోతున్నారు. ఇందులో వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు వచ్చే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. డబ్బు ఎక్కడ వెనక్కిపోతుందోనన్న ఉద్దేశంతో ఐదారు కిలోమీటర్ల దూరంలోని బ్యాంకులకు కాలినడక చేరుకుంటున్నారు. బ్యాంకు అధికారులు నగదుకు ఇబ్బంది లేదని చెప్పినా చాలామంది విత్‌డ్రాకే మొగ్గు చూపిస్తున్నారని తెలిపారు. ఇదిలాఉంటే.. లాక్‌డౌన్ నేపథ్యంలో చిన్నపిల్లలు ఉన్న ఉద్యోగినులకు, 50 ఏళ్లు పైబడిన బ్యాంకు సిబ్బందికి సెలవులు ఇచ్చినట్లు తెలుస్తోంది. డిపాజిట్లు తగ్గినా ఖాతాదారులకు కావాల్సిన నగదు ఉందనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

Tags: Deposit Transactions Reduced, United Nalgonda, withdrawals, Increased, covid 19 affect, lockdown

Advertisement

Next Story

Most Viewed