హరీశ్‌ విషయంలో మనసు మార్చుకున్న బండ్ల

by Shyam |
హరీశ్‌ విషయంలో మనసు మార్చుకున్న బండ్ల
X

దిశ, వెబ్‌డెస్క్ :
సినిమా గొప్పది.. అది జీవితాలనే మార్చేస్తుంది. ఇగోలు, కోపాలు, ద్వేషాలు.. ఇవేవి దాని ముందు నిలబడవు. సినిమానే నిలబడుతుంది.. సినిమానే నిలబెడుతుంది. హరీశ్ శంకర్, బండ్ల గణేష్ విషయానికొస్తే ఈ పదాలు అక్షరాల నిజం అనిపిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. అటు నిర్మాత బండ్ల గణేష్, ఇటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది. బండ్ల స్టార్ ప్రొడ్యూసర్ అయిపోతే.. హరీశ్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అయితే వీరిద్దరి మధ్య గొడవకు కూడా ఈ సినిమానే కారణమైంది. ‘గబ్బర్ సింగ్‌’ ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్బంగా సోషల్ మీడియాలో సెలెబ్రేషన్స్ స్టార్ట్ చేసిన అభిమానులు.. ట్వీట్లు, రీట్వీట్లతో రికార్డులు సెట్ చేశారు. అదే రోజు హరీశ్ శంకర్.. అభిమానులకు థాంక్స్ చెప్పడంతో పాటు గబ్బర్ సింగ్‌కు పనిచేసిన మెయిన్ కాస్ట్ అండ్ క్రూకు హార్ట్‌ఫుల్‌గా థాంక్స్ చెప్తూ ఒక్కొక్కరి గురించి ట్వీట్ చేశారు. కానీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌ను మాత్రం మరిచిపోయాడు

అయితే కావాలనే మరిచిపోయాడా? లేక అంతకుముందే ఏదైనా గొడవ జరిగిందా? తెలియదు కానీ, హరీశ్ శంకర్ మాత్రం తన ట్వీట్‌లో బండ్ల గణేష్‌కు థాంక్స్ చెప్పలేదు. దీంతో మండిపోయిన బండ్ల.. హరీశ్‌కు సంస్కారం లేదని, టాలెంట్ కూడా లేదన్నట్లే మాట్లాడాడు. గబ్బర్ సింగ్ ఓ రీమేక్ మూవీ అని, అయినా అన్ని విషయాలు పవన్ చూసుకుంటే.. బ్లాక్ బస్టర్ క్రెడిట్ మాత్రం హరీశ్ శంకర్‌కు వెళ్లిందని తిట్టిపోశాడు. లైఫ్‌లో నీతో సినిమా చేయనని ట్వీట్ చేశాడు.

దీనిపై కౌంటర్‌గా ట్వీట్ చేసిన హరీశ్.. నువ్వేమైనా అరవింద్ అనుకుంటున్నావా? లేకపోతే దిల్ రాజు అనుకుంటున్నావా? అసలు ప్రొడ్యూసర్‌గా నీ మొదటి రెండు సినిమాలు సక్సెస్ అయ్యాయా? అని కామెంట్ చేశాడు. ఎవరికి ఎవరు లైఫ్ ఇచ్చారో అర్థమవుతుందా? అని ఫైర్ అయ్యాడు. అప్పట్లో ఈ విషయంపై పెద్ద చర్చే జరగ్గా.. బండ్ల అన్ని ఇంటర్వ్యూల్లోనూ హరీశ్ శంకర్‌ను తక్కువ చేసి మాట్లాడటంతో పాటు అనేక విమర్శలు చేశాడు.

ఈ గొడవ జరిగి ఆరు నెలలు కావస్తుండగా.. ఇప్పుడు బండ్ల మనసు మార్చుకున్నాడు. తను చేసింది, మాట్లాడింది తప్పేమో అని ఫీలైపోయాడు. హరీశ్ శంకర్‌కు సారీ చెప్తూ.. ట్వీట్ చేశాడు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫైనెస్ట్ డైరెక్టర్ అయిన మీతో మరిన్ని బ్లాక్ బస్టర్స్ నిర్మించాలని కోరుకుంటున్నానని తెలిపాడు. దీనిపై స్పందించిన హరీశ్ శంకర్.. సార్ మీరు నాకు అన్నయ్య లాంటివారు క్షమాపణలు చెప్పొద్దు అన్నాడు. నా బ్లాక్ బస్టర్ నిర్మాత.. సినిమా మనకన్నా పెద్దది అని చెప్పాడు. బిగ్గెస్ట్ ఫిల్మ్స్ చేస్తూ బిగ్ సెలెబ్రిటీగా జీవించాలని కోరుకున్నాడు.

Advertisement

Next Story